యధేచ్చగా ‘కోడ్’ ఉల్లంఘన

First Published Feb 21, 2017, 2:52 AM IST
Highlights

ఎన్నికల వ్యవహారాలు చూడాలా? టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులకు హాజరవ్వాలో తేల్చుకోలేక జిల్లాస్ధాయి అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.

నిబంధనలున్నవి ఉల్లంఘించటానికే అన్నది ఓ సినిమాలో డైలాగ్. చంద్రబాబునాయుడు ప్రభుత్వ వ్యవహారం అలాగే ఉంది. రాష్ట్రంలో ఎంఎల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల కోడ్ కూడా ఫిబ్రవరి 14వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. కొన్ని జిల్లాల్లో అయితే జనవరి మొదటి వారంలోనే అమల్లోకి వచ్చేసింది.  ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడిన తర్వాత కానీ కోడ్ ఉపసంహరణ కాదు. అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుండి ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, మంత్రులు ఎవరు కూడా వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్సులు పెట్టేందుకు లేదు. సిఎం అయితే కొత్తగా పథకాలు ప్రకటించటం, ప్రారంభించటం, ఎన్నికలు జరిగే స్ధానాల్లో పర్యటించటం లాంటివి కూడా చేయకూడదు.

 

కానీ మన నిప్పు చంద్రబాబునాయుడు మాత్రం యధేచ్చగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఆయన దారిలోనే ప్రధాన కార్యదర్శి కూడా. ప్రతీ రోజూ టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్పరెన్సలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఒకవైపు ఎన్నికల్లో నామినేషన్లు వేయటానికి అభ్యర్ధులు సిద్ధమవుతుంటే, ఆ పని కూడా పక్కన బెట్టి కాన్ఫరెన్సులకు హాజరవ్వాల్సిందిగా పై నుండి ఆదేశాలు అందుతున్నాయి. ఇటు ఎన్నికల వ్యవహారాలు చూడాలా? టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులకు హాజరవ్వాలో తేల్చుకోలేక జిల్లాస్ధాయి అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల విధులకు హాజరుకాకపోతే అక్కడ ఇబ్బంది. కాన్ఫరెన్సులకు హాజరుకాకపోతే శాఖాపరంగా ఉన్నతాధికారులతో సమస్య. మధ్యలో జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ప్రాజెక్టు డైరెక్టర్ స్ధాయి అధికారులు కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుకుంటున్నారు.

click me!