atmakur bypoll: ముగిసిన ప్ర‌చారం... ఎల్లుండి పోలింగ్‌, లక్ష మెజార్టీ ఖాయమంటోన్న వైసీపీ

By Siva KodatiFirst Published Jun 21, 2022, 10:27 PM IST
Highlights

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీకి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌కు మంగళవారంతో ప్రచార గడువు ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది.  2,13,338 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు

దివంగ‌త మంత్రి మేకపాటి గౌత‌మ్ రెడ్డి (mekapati goutham reddy) హ‌ఠాన్మ‌ర‌ణంతో నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీకి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌కు (atmakur bypoll) సంబంధించిన మంగ‌ళ‌వారం సాయంత్రంతో ప్రచార గడువు ముగిసింది. ఈ నెల 23 (గురువారం)న ఉప ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. పోలింగ్‌కు సంబంధించి ఇప్ప‌టికే ఏర్పాట్ల‌న్నీ పూర్తి చేసింది ఎన్నికల సంఘం. నియోజ‌క‌వ‌ర్గంలోని 278 పోలింగ్ కేంద్రాల‌కు రేపు సాయంత్రానికి పోలింగ్ సిబ్బంది చేరుకోనున్నారు.

ఇదిలా ఉంటే... గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణంతో జ‌రుగుతున్న ఈ ఉప ఎన్నిక‌లో వైసీపీ త‌న అభ్య‌ర్థిగా గౌత‌మ్ రెడ్డి సోద‌రుడు మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డినే (mekapati vikram reddy) బ‌రిలోకి దించింది. దీంతో సంప్ర‌దాయాన్ని గౌర‌విస్తూ ఉప ఎన్నికకు టీడీపీ (tdp) దూరంగా ఉండిపోయింది. నామినేషన్ల ఉపసంహరణ ముగిసేనాటికి వైసీపీ (ysrcp) అభ్యర్థితో పాటు బీజేపీ స‌హా మొత్తం 14 మంది బ‌రిలో నిలిచారు.

బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వైసీపీ ముమ్మర ప్రచారం చేసింది. అటు బీజేపీ సైతం కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలను రంగంలోకి దింపి ప్రచారం చేసింది. 23న ఉదయం మాక్ పోలింగ్ తర్వాత ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. 278 కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. వీటిలో 122 సమస్యాత్మక కేంద్రాలని గుర్తించారు.  2,13,338 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారుల ప్రయత్నిస్తున్నారు. 

2019 సాధారణ ఎన్నికల్లో 83.38 శాతం ఓటింగ్ నమోదైంది. 26వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఆ రోజే మధ్యాహ్నానికి ఫలితం తేలనుంది. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సారి గెలుపు తథ్యమని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. 

click me!