కరోనా పాజిటివ్ : కెనాల్ లో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య !

By AN TeluguFirst Published Apr 16, 2021, 12:18 PM IST
Highlights

ఓ హృదయవిదారక ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. కరోనా భయం ఆ వృద్ధ దంపతులను వెంటాడింది. తాము చనిపోతామనే అనుమానం వారి జీవితాలను కబలించింది. తమ కుమారులు ఇద్దరు వ్యాపారాల నిమిత్తం దూరంగా ఉండడం.. తమకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ దంపతులిద్దరూ మానసికంగా కుంగిపోయారు.

కరోనా శరీరం మీద కంటే మానసికంగా ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. కరోనా వస్తుందేమో నన్న భయం... వస్తే కోలుకోలేమేమో అనే భయం.. మానసికంగా చిత్రహింసకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది.

అలాంటి ఓ హృదయవిదారక ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. కరోనా భయం ఆ వృద్ధ దంపతులను వెంటాడింది. తాము చనిపోతామనే అనుమానం వారి జీవితాలను కబలించింది. తమ కుమారులు ఇద్దరు వ్యాపారాల నిమిత్తం దూరంగా ఉండడం.. తమకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ దంపతులిద్దరూ మానసికంగా కుంగిపోయారు.

దీంతో బలవన్మరణానికి పాల్పడ్డారు రాయవరం మండలం మాచవరం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి (71), సావిత్రి దంపతులు గురువారం మండపేట కెనాల్ లో పడి మృతి చెందారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వెంకట్రెడ్డి, సావిత్రి దంపతులకు ఈ నెల 12న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్కడి నుంచి హోం ఐసొల్యూషన్ లో ఉంటున్నారు.

వెంకట్రెడ్డి సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో వ్యాపారం కోసం ఓ కుమారుడు ఒడిశాలో.. మరో కుమారుడు రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. కొడుకులిద్దరూ వీరి బాగోగులు చూసుకుంటున్నారు. 

 ఈ నెల 12 నుంచి ఈ దంపతులిద్దరూ హోం ఐసోలేషన్ లో ఉంటుండగా, గురువారం ఉదయం ఇంట్లో నుంచి అలికిడి లేకపోవడంతో ఇరుగుపొరుగువారు రాజమహేంద్రవరం లో ఉంటున్న కుమారుడికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.

కుమారుడు అనుమానంతో ఇంటివద్ద, స్థానికంగా తల్లిదండ్రులు ఆచూకీ కోసం ప్రయత్నించారు. సాయంత్రం సమయంలో స్థానికంగా ఉన్న మండపేట కెనాల్లో మాచవరం గ్రామం సమీపంలో మృతదేహాలు తేలడంతో వీరు బలవన్మరణానికి పాల్పడినట్టు తెలిసింది. కేవలం కరోనా సోకిందన్న భయంతో వీరు కాలువలో పడి మృతి చెంది ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.

కరోనా భూతం దంపతులను పొట్టన పెట్టుకోవడం పై స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు దీనిపై రాయవరం పోలీసులను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
 

click me!