
Earthquake : ఆంధ్ర ప్రదేశ్ లో గత రాత్రి భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించింది. దీంతో భయంతో నిద్రలేచిన ప్రజలు ఇళ్లనుండి బయటకు పరుగుతీశారు. అయితే భూకంప తీవ్రత తక్కువే ఉండటంతో ప్రమాదం తప్పింది... కానీ ప్రజల్లో మాత్రం ఆ భయం ఇంకా కొనసాగుతోంది.
ఒంగోలులో భూకంపనాలను జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (National Center for Seismology) కూడా నిర్దారించింది. ప్రకాశం జిల్లాలో అర్థరాత్రి 2 గంటల 2 సెకన్ల సమయంలో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది... దీని తీవ్రత 3.4 గా ఉన్నట్లు వెల్లడించారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు.
ఒంగోలు పట్టణంలోని గాయత్రి, విజయ్ నగర్, వడ్డెపాలెం, భాగ్యనగర్, శ్రీరామపురం కాలనీలతో పాటు సీఎస్ఆర్ శర్మ కాలేజ్ ప్రాంతాల్లో ప్రధానంగా భూకంప ప్రభావం కనిపించింది. మిగతా ప్రాంతాల్లో భూమి కంపించున్నా ఈ వార్త వ్యాప్తి చెందడంతో నగరవ్యాప్తంగా ఆందోళన కొనసాగింది. దీంతో చాలా కాలనీల్లో ముందుజాగ్రత్తగా ప్రజలు రోడ్లపైనే జాగరణ చేశారు. ఉదయం వరకు మళ్లీ ఎలాంటి ప్రకంపనలు చోటుచేసుకోకపోవడంతో ఒంగోలు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.