
గుంటూరు: సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర (dhulipalla narendra) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సంగం డెయిరీ (sangam dairy) చైర్మన్ గా ఎవరు ఉంటారో వారే ధూళిపాళ్ల వీరయ్య చౌదర మొమోరియల్ ట్రస్ట్ బాధ్యతలు కూడా చూసుకుంటారని నరేంద్ర తెలిపారు. ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ డివిసి ట్రస్ట్ (DVC Trust) ను అడ్డుపెట్టుకుని తనపై విమర్శలు చేస్తున్నారని... ట్రస్టు ఆస్తులు తాము కాజేసినట్లు మాట్లాడుతున్నారని ధూళిపాళ్ళ అన్నారు. కాబట్డి డివిసి ట్రస్ట్ వ్యవహారాల్లో ఇకపై తానుగానీ, తన కుటుంబసభ్యులు గానీ చూసుకోరని నరేంద్ర తెలిపారు. సంగం డెయిరీ ఛైర్మన్ ను పాడిరైతులంతా కలిసి ఎన్నికల ద్వారా గెలిపించుకుంటారు... కాబట్టి డివిసి ట్రస్ట్ బాధ్యతలను కూడా వారికే అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇకపై ట్రస్ట్ వ్యవహారాలను సంగం డెయిరీ ఛైర్మన్ చూసుకుంటారని ధూళిపాళ్ల స్పష్టం చేసారు.
గతంలో డెయిరీలో పనిచేసి వెళ్లినవాళ్లే ఇప్పుడు కోర్టుల్లో పిటిషన్లు వేసి ట్రస్టుని వివాదాల్లోకి లాగారని... ఈ చెట్టు నీడలో పెరిగిన వారే ఇలా చేయటం ఎంతో బాధగా ఉందన్నారు. ఇలా పిటిషన్లు వేసేందుకు కొంతమంది వెనక ఉండి ప్రోత్సస్తున్నారన్నారు. ఇలాంటివారు సొంత పార్టీ వారైనా, ఇతర పార్టీల వారైనా రాజకీయంగా తేల్చుకుంటానని ధూళిపాళ్ల హెచ్చరించారు.
''ఎవరైనా నాతో తేల్చుకోండి... డివిసి ట్రస్ట్ తో రాజకీయాలు వద్దు. సంగం డైయిరీ మీద ఎంతో మంది ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి డివిసి ట్రస్ట్ తో గానీ, సంగం డెయిరీని కాని వివాదాల్లోకి లాగకండి. కావాలంటే నాతో ప్రత్యక్షంగా తేల్చుకోండి'' అని ధూళిపాళ్ల అన్నారు.
''నేను అక్రమాలకు పాల్పడినట్లు ఏసిబి అధికారులు ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు. టన్నుల కొద్దీ కాగితాలు చూసినా ఒక్క తప్పు తేల్చలేకపోయారు. నాపై తప్పుడు ఆరోపణలు చేసినవారు ఈ విషయం తెలుసుకోవాలి'' అని ధూళిపాళ్ళ నరేంద్ర తెలిపారు.
డివిసి (dhulipalla veeraiah coudary memorial trust) ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా (guntur district) జిల్లా చేబ్రోలు మండలంలోని వడ్లమూడిలో డివిసి హాస్పిటల్ నడుస్తోంది. పాడి రైతులతో పాటు వారి కుటుంబ సభ్యులకు 50శాతం రాయితీతో అంతర్జాతీయ ప్రమాణాలు కల్గిన వైద్యం అందిస్తోందని ఈ హాస్పిటల్ కు మంచి పేరుంది.
అయితే ఈ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఇప్పటివరకు ధూళిపాళ్ళ కుటుంభీకులే కొనసాగేవారు. ఇటీవల రాజకీయంగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో ధూళిపాళ్ల నరేంద్ర ఈ ట్రస్ట్ బాధ్యతల నుండి తప్పుకున్నారు. ఎన్నికల ద్వారా నియమితులయ్యే సంగం డెయిరీ ఛైర్మన్ కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.