ఇంద్రకీలాద్రిపై  కన్నుల పండువగా  ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు.. తేదీల‌ను ప్ర‌కటించిన అధికారులు..  

By Rajesh KFirst Published Sep 1, 2022, 1:01 PM IST
Highlights

ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకూ దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయి. ప‌ది రోజుల పాటు సాగే ఉత్సవాల్లో అమ్మ‌వారు పది అలంకారాల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.  
 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని  విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు
కన్నుల పండువగా జ‌రుగ‌నున్నాయి. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకూ దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయి. ప‌ది రోజుల పాటు సాగే ఉత్సవాల్లో అమ్మ‌వారు పది అలంకారాల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.  

ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకూ దసరా మహోత్సవాలు అతివైభవంగా నిర్వహించడం జరుగుతుందని ధర్మకర్తల మండలి, కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ గురువారం విడుద‌ల చేసిన‌ ప్రకటనలో వెల్లడించారు. 
 
ఇప్పటికే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై  దసరా కో-ఆర్డినేషన్ సమీక్షించారు. కరోనా త‌గ్గ‌డంతో పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌నీ,  వారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  ఆల‌య ఆధికారులు పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారిక లాంఛ‌న ప్ర‌కారం.. మూలా నక్షత్రం రోజున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని, పట్టు వస్త్రాల సమర్పించ‌నున్నారు. 
  
దసరా శరన్నవరాత్రి వేడుకల భాగంగా.. ఇంద్ర‌కీలాద్రిని అధికారులు కన్నుల పండువగా ముస్తాబు చేశారు. ఉత్స‌వాల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా ఉండేందుకు అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే దసరా మహోత్సవాలకు టెండర్లు పూర్తయ్యాయని, ఘాట్ రోడ్డులో క్యూలైన్ల ఏర్పాటు పనులు ప్రారంభ‌మైన‌ట్టు ఆల‌య అధికారులు తెలిపారు.

కృష్ణాన‌దిలో స్నానాలు చేసే వారికోసం ప్ర‌త్యేకంగా ఘాట్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది రూ.80 లక్షలతో ప్రత్యేకంగా విద్యుద్ధీకరణ చేయ‌నున్నారు. ఈ ఏడాది కూడా అంతరాలయ దర్శనాలు లేవ‌ని తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో.. ప్ర‌తిరోజూ 10 వేల మందికి పై  అమ్మ‌వారిని ద‌ర్శ‌నం చేసుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఉత్స‌వాల స‌మ‌యంలో యధావిధిగా రూ100 , రూ300, ఉచిత దర్శనాలు ఉంటాయని తెలిపారు.

అలాగే..  వీఐపీ బ్రేక్ దర్శనం ప్రతిపాదనల పై వచ్చే సమన్వయ కమిటీలో తుది నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు. తిరుపతి మాదిరి నాణ్యత కలిగిన లడ్డూ ప్రసాదం అందిస్తామ‌ని,  కుంకుమార్చనలో పాల్గొనే వారి కోసం 20 వేల టిక్కెట్లు ఆన్ లైన్ లో ఉంచామ‌ని తెలిపారు. ఈ ఉత్స‌వాల‌కు విచ్చేసే భక్తులకు సాంబారు, పెరుగన్నం, బెల్లంపొంగలి అందిస్తామ‌ని, గతంలో మాదిరిగానే నగరోత్సవం నిర్వహిస్తామ‌ని అధికారులు తెలిపారు.
 
భ‌క్తుల‌కు మౌళిక‌ సదుపాయం ఏర్పాటులో భాగంగా..  వాటర్ ప్యాకెట్స్ బదులు ఆర్వో వాటర్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. గతేడాది ఉత్స‌వాల ద్వారా ఆల‌యానికి రూ. 9.50 కోట్లు ఆదాయం రాగా.. రూ. 3 కోట్లు ఖర్చయ్యిందని ఆల‌య అధికారులు వెల్ల‌డించారు.

ఈ  ఏడాది క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఆల‌యానికి విచ్చేసేవారి సంఖ్య పెరుగుతుంద‌నీ, 15 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. భ‌క్తుల‌కు మౌళిక‌ సదుపాయం ఏర్పాట్ల నేపధ్యంలో 5 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నామ‌ని, రేపు మంత్రి దేవాదాయ శాఖ మంత్రితో పాటు అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఏర్పాట్ల ప‌రిశీల‌న చేస్తామని అధికారులు తెలిపారు. ఆలయ దర్శనవేళలు, టిక్కెట్లు బుకింగ్, మార్పులు చేర్పులు కోసం దేవస్థానం వెబ్‌సైట్‌లో సందర్శించవచ్చునని తెలిపారు.

click me!