ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యను అవాస్తవంగా చిత్రించడం తగదు.. వార్తా చానెళ్ల కథనాలను ఖండించిన పోలీసు శాఖ

By Mahesh KFirst Published May 15, 2022, 8:20 PM IST
Highlights

సర్పవరం పోలీసు స్టేషన్‌లో ఎస్ఐగా పని చేసి గోపాలకృష్ణ ఆత్మహత్యను కొన్ని చానెళ్లు తప్పుగా చిత్రీకరిస్తున్నాయని ఏలూరు పోలీసులు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. గోపాలకృష్ణ మరణానికి ఉన్నతాధికారుల వేధింపులుగానీ, పోస్టింగ్‌ల విషయం గానీ, కారణం కాదని స్పష్టం చేశారు. మీడియా చానెళ్లు తప్పుడు ప్రచారానికి పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు.
 

అమరావతి: సర్పవరం పోలీసు స్టేషన్‌లో పని చేస్తూ ఆత్మహత్య చేసుకున్న గోపాలకృష్ణ మృతిపై కొన్ని చానెళ్లలో వస్తున్న వార్తలను పోలీసు శాఖ ఖండించింది. ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పవరం పోలీసు స్టేషన్‌లో పని చేసిన ఎస్ఐ గోపాలకృష్ణ మృతిపై వివరణలు ఇచ్చారు. కొన్ని చానెళ్లలో ఈ మృతిపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. అసత్యమైన ప్రచారాన్ని పోలీసులు ఖండించారు.

గోపాలకృష్ణ 2019 వరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన డొంకరాయి పోలీసు స్టేషన్‌లో పని చేశారని వారు వివరించారు. ఆ తర్వాత ఆయన సర్పవరం, రాజోలు, కాకినాడ ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లలో విధులు నిర్వహించారని తెలిపారు. పోస్టింగ్‌ల విషయంలో ఆయనకు ఎలాంటి అన్యాయం జరగలేదని పేర్కొన్నారు.

అంతేగానీ, ఎస్ఐ గోపాలకృష్ణ మృతికి పోలీసు ఉన్నత అధికారుల వేధింపులు, పోస్టింగ్‌ల వ్యవహారం కారణం కాదని స్పష్టం చేశారు. గోపాలకృష్ణ సున్నిత మనస్కుడని, ఆయన సున్నిత మనస్తత్వం కకారణంగానే పోలీసు శాఖలో ఆయన ఇమడలేకపోయారని వివరించారు. గోపాలకృష్ణ ఆయన చదువుకు తగిన వృత్తిలోకి వెళ్లడానికి అనేక ప్రయత్నాలు చేశారని తెలిపారు. అదీగాక, గోపాలకృష్ణ కుటంబం కూడా చాలా వివరాలు మీడియాకు వెల్లడించారని గుర్తు చేశారు.

కాబట్టి, తప్పుడు ఆరోపణలతో పోలీసు శాఖను అవాస్తవంగా చిత్రించడం తగదని తెలిపారు. ఇలా అవాస్తవ చిత్రణతో పోలీసు శాఖ మనోధైర్యాన్ని కించపరిచే ప్రయత్నం చేయడం సరికాదని హెచ్చరించారు.

ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యను రాజకీయం చేయడం ఎంతమాత్రం ఆమోదనీయం కాదని పేర్కొన్నారు. వ్యవస్థ నిర్వీర్యం అయితే పోలీసు యంత్రాంగం కూడా నిర్వీర్యం అవుతుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. గోపాలకృష్ణ మరణం పోలీసు వ్యవస్థకు కూడా లోటేనని తెలిపారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయం అందిస్తామని పేర్కొన్నారు. అంతేకానీ, పోలీసు శాఖను తప్పుగా చిత్రిస్తూ, ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా తప్పుడు ప్రచారానికి పాల్పడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

click me!