Chandrababu: చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక 25 మంది మృతి.. అధైర్యం వద్దు, సత్యమే గెలుస్తుంది: నారా లోకేశ్

By Mahesh K  |  First Published Sep 12, 2023, 4:01 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక 25 మంది ప్రాణాలు కోల్పోయారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు అధైర్యపడొద్దని, అంతిమంగా సత్యం గెలిచి తీరుతుందని వివరించారు.
 


హైదరాబాద్: టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అధైర్యపడవద్దని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచించారు. అంతిమంగా సత్యమే గెలుస్తుందని భరోసా ఇచ్చారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజలు వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని చెప్పారు. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ పరిణామాలు చూసి వారు తట్టుకోలేకపోతున్నారని వివరించారు. ఇప్పటి వరకు 25 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని తెలిపారు.

టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు అధైర్యం వద్దని, కచ్చితంగా సత్యమే గెలిచి తీరుతుందని నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబు అరెస్టు జగన్ కక్షపూరిత చర్య అనేది దేశమంతటా గుర్తించిందని వివరించారు. అరెస్టు పై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. చంద్రబాబుపై ఆధారాలు లేకున్నా కేసు పెట్టారని, వారి డ్రామాకు త్వరలోనే తెర పడుతుందని అన్నారు. కాబట్టి, ఎవరూ భావోద్వేగాలకు గురి కావొద్దని, అందరూ క్షేమంగా ఉండాలని పిలుపు ఇచ్చారు.

Latest Videos

Also Read: డీజిల్ కార్లపై అదనంగా పది శాతం జీఎస్టీ.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ

చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన చేసినందుకు హత్యాయత్నం కేసులు పెడతారా? నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తారా? అంటూ జగన్ ప్రభుత్వంపై నారా లోకేశ్ నిప్పులు కురిపించారు. శ్రీకాళహస్తిలో నిన్న 16 మంది టీడీపీ నేతలు సామూహిక నిరాహారదీక్షకు దిగారని, వారిపై హత్యాయత్నం కేసు పెట్టి రిమాండ్‌కు పంపారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితి మరే రాష్ట్రంలోనూ ఉండదని అన్నారు. ప్రజల్లోని ఆవేదన, ఆగ్రహం బయటకు రాకుండా అక్రమ కేసుల కుట్రకు తెరలేపారని ఆరోపణలు చేశారు.

click me!