తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆకస్మిక మృతి

By telugu teamFirst Published Nov 29, 2021, 7:25 AM IST
Highlights

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆకస్మికంగా మరణించారు. విశాఖలో కార్తిక దీపోత్సవం ఏర్పాట్లలో ఉన్న శేషాద్రి గుండెపోటు రావడంతో తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆకస్మికంగా మరణించారు. సోమవారం వేకువ జామున గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. విశాఖపట్నంలో కార్తిక దీపోత్సవం ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఆయన మరణించారు. ఆదివారం రాత్రి కాస్తా నలతగా ఉందంటూ చెప్పిన Seshadri ఆ తర్వాత నిద్రపోయారు. సోమవారం తెల్లవారు జామున కాస్తా నలతగా ఉందని చెప్పడంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. 

ఆస్పత్రికి తరలించేలోగానే డాలర్ శేషాద్రి కన్నుమూశారు. 1978 నుంచి Dollar Seshadri తిరుమల శ్రీవారి సేవలో ఉంటూ వస్తున్నారు. ఆయన 2007లో పదవీ విరమణ చేశారుయ అయితే ఆయన సేవలు అత్యవసరం కావడంతో ఓఎస్డీగా కొనసాగించారు. ఆయన దాదాపు 43 ఏళ్ల పాటు శ్రీవారి సేవలో తరలించారు. ఆయనకు 2003లో మూత్రపిండాల మార్పిడి జరిగింది. అయినప్పటికీ ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అన్నింటిని ఆయన పర్యవేక్షిస్తూ వచ్చారు. 

డాలర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. అయితే, తాను డాలర్ వేసుకుని మీడియాలో కనిపిస్తాను కాబట్టి అది చూసి మీడియా వాళ్లు తనకు డాలర్ శేషాద్రి అని పేరు పెట్టారని ఆయన ఒకానొక సందర్భంలో చెప్పారు. నిజానికి, తిరుమలలో జరిగిన కుంభకోణంలో శేషాద్రి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయనకు డాలర్ శేషాద్రి అనే పేరు వచ్చింది. శేషాద్రి మరణించారనే వార్త చేరడంతో టీటీడీ ఆలయ ఉద్యోగులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. డాలర్ శేషాద్రి భౌతిక కాయాన్ని అపోలో ఆస్పత్రి నుంచి తరలించారు. భారీ బందోబస్తు మధ్య ఆయన భౌతిక కాయాన్ని తిరుపతికి తరలించారు. 

డాలర్ శేషాద్రి మృతి తీరని లోటు అని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మా రెడ్డి అన్నారు. డాలర్ శేషాద్రి మృతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా సంతాపం వ్యక్తం చేశారు. శేషాద్రి మృతి తనకు వ్యక్తిగతంగా కూడా తీరని లోటు అని ఆయన అన్నారు. డాలర్ శేషాద్రి ధన్యజీవి అని ఆయన అన్నారు. డాలర్ శేషాద్రితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. శ్రీవారికి శేషాద్రి ప్రత్యేక రీతిలో సేవలు చేశారని ఆయన అన్నారు.

డాలర్ శేషాద్రి గతంలో 2018లో కూడా అస్వస్థతకు గురయ్యారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గరుడ సేవలో ఆయన ఎక్కువ సేపు పాల్గొన్నారు. దీంతో ఆయన ఆలసటకు లోనై అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

click me!