వైద్యుల నిర్వాకం: కరోనా తగ్గకముందే రోగి డిశ్చార్జ్, డాక్టర్ల తప్పు వల్ల ప్రమాదంలో కుటుంబం (వీడియో)

By Sree sFirst Published Apr 27, 2020, 1:38 PM IST
Highlights

కరోనా వైరస్ తగ్గకముందే, వైరస్ లేదని రోగిని ఇంటికి పంపించిన డాక్టర్లు, అతడి కుటుంబాన్ని కూడా డాక్టర్లు ప్రమాదంలోకి నెట్టారని ఆవేదనతో వీడియో పోస్ట్ చేసిన సదరు వ్యక్తి. 

కరోనా వైరస్ పూర్తిగా తగ్గకముందే తెలంగాణాలో కొత్తగూడెం డీఎస్పీని డాక్టర్లు నిర్లక్ష్యంగా డిశ్చార్జ్ చేసిన సంఘటనను మరువక ముందే.... ఇలాంటిదే మరో సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. 

కరోనా వైరస్ లక్షణాలు కనబడుతున్నాయని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక లారీ డ్రైవర్ అడ్మిట్ అయ్యాడు. అతడికి రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. రెండవసారి నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని, ఇంటికి పంపించివేశారు డాక్టర్లు. 

అతడు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఆ వెంటనే మర్నాడు ఉదయం అతడిని వచ్చి ఆసుపత్రిలో చేరమని డాక్టర్లు ఫోన్ చేసారు. కరోనా వైరస్ ఇంకా తగ్గలేదని చావు కబురు చల్లగా చెప్పారు వైద్యులు. 

కరోనా వైరస్ పూర్తిగా నయమైపోయిందని ఆనందంగా ఇంటికి వెళ్లిన అతడు తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపాడు. ఇప్పుడదే అతనిపాలిట శాపంగా మారింది. వైద్యుల నిర్లక్ష్యానికి ఇప్పుడు అతడి కుటుంబమంతా కూడా క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి. 

ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1177కు చేరుకుంది. వీరిలో ఇప్పటి వరకు 235 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 31 మంది మరణించారు. 

గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 23, కృష్ణా జిల్లాలో 33, కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు జిల్లాలో 7, శ్రీకాకుళం ఒక కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసుల నమోదులో 292 కేసులతో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు జిల్లా 237 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

అయితే, కృష్ణా జిల్లాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో 33 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 210కి చేరుకుంది. కొత్తగా అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశం, కడప, విశాఖపట్నం జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు. విజయనగరం జిల్లా ఇప్పటికీ కరోనా ఫ్రీగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మరో కేసు నమోదు కావడంతో సంఖ్య 4కు చేరకుంది.

 

click me!