
తెలుగుదేశం పార్టీలో అసమ్మతి ఇంకా చాలారినట్లు లేదు. మంత్రిపదవుల కోసం చాలామంది ప్రయత్నించి భంగపడ్డారు. దాంతో ముందెన్నడూ లేని విధంగా చంద్రబాబుపై వ్యతిరేకత బాహాటంగానే బయటపడింది. వీరిలో చాలామంది చంద్రబాబునాయడుపై ఇంకా మండిపడ్డారు. అయితే, ఇందులో రెండు రకాలు. ఒకటి రకం ఫిరాయింపు ఎంఎల్ఏలకు మంత్రిపదవులు ఇవ్వటాన్ని వ్యతిరేకించిన వారు. రెండో రకం మంత్రిపదవులను ఆశించి భంగపడ్డ సీనియర్లు. మంత్రివర్గ ప్రక్షాళన చంద్రబాబును బాగానే కలవరపెట్టింది. పార్టీ ఏర్పాటైన తర్వాత ఇంతలా అసమ్మతి రేగటమన్నది ఇదే తొలిసారి.
సరే, అందుబాటులో ఉన్న కొందరిని తన వద్దకు పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడినా సమస్య అయితే కొలిక్కి రాలేదు. పలువురు ఇంకా ఆగ్రహంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే, ఆ కోపమంతా అధినేత చంద్రబాబుపైనా లేక మంత్రులపైనా అన్నది అర్ధం కావటం లేదు. తాజాగా జరిగిన రెండు ఘటనలే అందుకు ఉదాహరణలుగా నిలిచాయి.
సమాచారశాఖ మంత్రిగా అనంతపురం జిల్లాకు చెందిన కాల్వ శ్రీనివాసులు ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు. సదరు కార్యక్రమానికి జిల్లాలోని పలువురు నేతలు గైర్హాజరవటం చర్చనీయాంశమైంది. ఎందుకంటే, మంత్రిపదవుల కోసం జిల్లాలోని పయ్యావుల కేశవ్, బికె పార్ధసారధి, యామినీబాల, చాంద్ భాష తదితరులు ప్రయత్నించారు. పల్లె రఘునాధరెడ్డి పదవి నిలుపుకోవాలని ప్రయత్నించారు. అయితే, తమ ప్రయత్నాల్లో వారందరూ విఫలమయ్యారు. కాల్వకు మంత్రిపదవి వరించింది. దాంతో అందరూ మండిపడుతున్నారు. మంత్రి బాధ్యతలు తీసుకున్నపుడు పరిటాల, పల్లె తప్ప ఇంకెవరూ హాజరవ్వలేదు. దాంతో కోపం కాల్వపైనా లేక చంద్రబాబుపైనా అన్న చర్చ మొదలైంది.
అలాగే, సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబుకు శ్రవణ్ కుమార్ వర్గీయుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. గుంటూరు జిల్లాలో అంబెద్కర్ విగ్రహం ఏర్పాటుకు స్ధల ఎంపిక కోసం జిల్లాకు మంత్రి వెళ్ళారు. అక్కడ శ్రవణ్ వర్గం నుండి తివ్ర వ్యతిరేకత కనబడింది. అదే విధంగా, దెందులూరు ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ తన గన్మెన్లను జిల్లా ఎస్పీకి తిప్పి పంపేసారు.
శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ ఎంఎల్ఏ గౌతు శివాజి, గుంటూరు జిల్లాలో మరో ఎంఎల్ఏ దూళిపాళ నరేంద్ర, పశ్చిమగోదావరి జిల్లాలో బుచ్చయ్యచౌదరి లాంటి చాలామంది సీనియర్లు చంద్రబాబుకు అందుబాటులో లేరు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు వైఖరిపై పలువురు నేతల్లో అసమ్మతి లోలోన ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది. మరి ఇదంతా ఎటు దారి తీస్తుందో ఎవరూ చెప్పలేకున్నారు.