జగన్ 3 రాజధానుల నిర్ణయం బహు బాగుంది: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

By Siva KodatiFirst Published Dec 19, 2019, 2:49 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలంటూ చేసిన ప్రతిపాదన బాగుందన్నారు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి . 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలంటూ చేసిన ప్రతిపాదన బాగుందన్నారు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి .

రాష్ట్రం, అభివృద్ధి దిశలో ముందుకు దూసుకెళ్లేందుకు ఇది చాలా గొప్ప నిర్ణయమని కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు. చాలా రోజులుగా దక్షిణ భారతంలో దేశ రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని తాము కోరుతున్నామని సుప్రీంకోర్టు బెంచ్ కూడా తమ డిమాండ్‌ను సమర్ధించిందని జగదీశ్వర్ రెడ్డి గుర్తుచేశారు.

Also Read:ఏపీకి మూడు రాజధానులు: వెలగపూడిలో రైతుల దీక్షలు

ఇక్కడ కేవలం 130 ఎంపీ స్థానాలు ఉండటం వల్లే ప్రభుత్వాలు దక్షిణాదిని చిన్నచూపు చూడటానికి కారణమని ఆయన ఆరోపించారు. ఒక ప్రభుత్వం ఒక రాష్ట్రంలోని అభివృద్ధిని జిల్లాల మధ్య సమానంగా పంచనప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు పుట్టుకొస్తాయని అందుకు ఉదాహరణ తెలంగాణ, ఉత్తరాంచల్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌ రాష్ట్రాలేనని జగదీశ్వర్ రెడ్డి గుర్తుచేశారు.

ప్రభుత్వంలో రాజకీయ పార్టీలకు లోటు కనిపించినప్పుడు ప్రత్యేక వాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోతుంటారని, రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలు ముందుకు తీసుకెళ్లిన సంగతిని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో జగన్ తీసుకున్న నిర్ణయం కొన్ని రాజకీయ పార్టీలకు చెంపపెట్టన్నారు.

ప్రస్తుతం దేశంలో కర్ణాటక, మహారాష్ట్రలలో రెండు అసెంబ్లీలు, రెండు హైకోర్టులు ఉన్నాయని కేతిరెడ్డి తెలిపారు. తమిళనాడులో ప్రతి జిల్లా కూడా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందాయని, రాజధాని చెన్నైలోనే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా తమిళులు పెట్టుబడులు పెట్టారని జగదీశ్వర్ రెడ్డి గుర్తుచేశారు.

Also Read:రాజధానిపై నిపుణుల కమిటీ: జగన్‌ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల వలన అభివృద్ధి హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమై తెలంగాణ వాదం బాగా బలపడిందన్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అప్పటి పాలకులు ఆలోచించి వుంటే తెలుగు ప్రజలు రెండుగా విడిపోయేవారు కాదని కేతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం దక్షిణాదిన రెండో రాజధానిని ప్రకటించాలని, ప్రధాని నరేంద్రమోడీ ఆ దిశగా అడుగులు వేయాలని జగదీశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

click me!