జగన్ లా నిలదీసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా..?: పార్థసారథి

By Nagaraju TFirst Published Jan 20, 2019, 4:06 PM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి వైసీపీ నేత పార్థసారథి నిప్పులు చెరిగారు. ఏపీని ఉద్దరించలేని చంద్రబాబు జాతీయ రాజకీయాలను తిప్పుతాడంటూ అంటూ విమర్శించారు. 

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి వైసీపీ నేత పార్థసారథి నిప్పులు చెరిగారు. ఏపీని ఉద్దరించలేని చంద్రబాబు జాతీయ రాజకీయాలను తిప్పుతాడంటూ అంటూ విమర్శించారు. 

ఆదివారం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కోల్ కత్తాలో జరిగిన ర్యాలీలో ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయం గురించి గానీ, ప్రత్యేక హోదా గురించి గానీ మాట్లాడలేని దమ్ము ధైర్యంలేని పిరికిపంద, అసమర్దుడు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. 

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి వైఎస్ జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయితే ఆ భేటీలో ప్రత్యేక హోదా కోసం జగన్ నిలదీశారని గుర్తు చేశారు. అదే వైఎస్‌ జగన్‌కు చంద్రబాబుకు ఉన్న తేడా అని పార్థసారథి స్పష్టం చేశారు. కేటీఆర్, వైఎస్ జగన్ చర్చలు జరిపితే అది ఫిడేల్ ఫ్రంట్ అని విమర్శిస్తున్న టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. 
తమది ఫిడేల్ ఫ్రంట్ అయితే కలకత్తాలో జరిగింది తోడేళ్ల ఫ్రంటా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ కలుగులో దాక్కున్నారని మంత్రి దేవినేని ఉమ కళ్లులేని కబోదిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 14నెలలపాటు  ప్రజాసంకల్పయాత్ర చేసిన వైఎస్ జగన్ ప్రజల హృదయాలలో ఉన్నారనే విషయం మరిచిపోయావా? అంటూ ఉమపై మండిపడ్డారు. 

ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు మొదలు పెట్టారని విమర్శించారు. ప్రజలు చంద్రబాబును ఓడించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారని ఎలాంటి ప్రలోభాలకు లొంగరన్నారు. 

వైఎస్‌ జగన్ నవరత్నాలు ప్రకటిస్తే వాటికి మన రాష్ట్ర బడ్జెట్ సరిపోదన్న మంత్రి యనమల పింఛన్‌ పెంపు, డ్వాక్రామహిళల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు, రైతుబంధు పేరుతో ఇన్ పుట్ సబ్సిడీలను చంద్రబాబు ప్రకటిస్తే ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. 

చంద్రబాబు ప్రకటించిన పథకాలు వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలలోనివే కాపీ కొట్టారని ఆరోపించారు. నవరత్నాలలో నుంచి దొంగిలించి చంద్రబాబు ప్రకటించడమంటే అది వైఎస్‌ జగన్ విజయమేనని అభిప్రాయపడ్డారు. 

ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి కనీసం ఐదు వందల కోట్లు కూడా చెల్లించకుండా చికిత్సలు నిలిపివేసి, ఇప్పుడు ఐదులక్షల పెంపుదల ఎలా ఇస్తారు అంటూ ప్రశ్నించారు. డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు, పదివేలు అంటూ చంద్రబాబు తాయిలాలు ప్రకటిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

యాదవ కార్పొరేషన్ కోసం వెళ్తే దాని గురించి సరైన హామీ ఇవ్వలేదని, నాయీబ్రాహ్మణులు ఆదుకోమని వెళ్తే వారిని తోకలు కత్తిరిస్తామని అవమానించాడని గుర్తు చేశారు. ఈరోజు బీసీ నేతలను పిలిచి తాయిలాలు ప్రకటిస్తూ దొంగప్రేమ ఒలకబోస్తున్నారని ధ్వజమెత్తారు. 

వైఎస్ జగన్ బీసీల అధ్యయన కమిటీ పెట్టి వారికి ఏం కావాలో విస్తృత స్దాయిలో చర్చించారని త్వరలో బీసీ డిక్లరేషన్ ప్రకటించబోతున్న తరుణంలో చంద్రబాబు దొంగ ప్రేమలు నటిస్తున్నారంటూ మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేయగలిగేది వైఎస్‌ జగన్ మాత్రమే అని బీసీ వర్గాలు నమ్ముతున్నాయని పార్థసారథి  స్పష్టం చేశారు.  

click me!