ధర్మవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 25, 2024, 3:07 PM IST
Highlights

రాష్ట్రంలోని అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో ధర్మవరం ఇప్పటికీ కొనసాగుతుండటం దురదృష్టకరం. ఇక్కడి నేతన్నలు తమ కళతో ధర్మవరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు. నియోజకవర్గంలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయం , చేనేత రంగాలపై ఉపాధి పొందుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఈ సెగ్మెంట్ కంచుకోట. 1983 నుంచి 2004 వరకు టీడీపీకి ధర్మవరంలో ఎదురులేకుండా పోయింది. అయితే 2009లో కేతిరెడ్డి ఎంట్రీతో తెలుగుదేశం జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ సెగ్మెంట్ పరిధిలో ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలున్నాయి. కమ్మ, రెడ్డి సామాజికవర్గాలకు చెందిన నేతలే ధర్మవరంలో ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. ధర్మవరంలో మరోసారి గెలవాలని కేతిరెడ్డి ధీమాగా వున్నారు. కూటమి విషయానికి వస్తే.. తన కంచుకోటలో తిరిగి పాగా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

ధర్మవరం ఈ పేరు చెప్పగానే.. చేనేత కార్మికులు, మగువల మనుసు దోచే చీరలు గుర్తొస్తాయి. ఇక్కడి నేతన్నలు తమ కళతో ధర్మవరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు. నియోజకవర్గంలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయం , చేనేత రంగాలపై ఉపాధి పొందుతున్నారు. అయితే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల అండతో ఈ ప్రాంతంలో కత్తులు , బాంబులు స్వైర విహారం చేస్తూ రక్తపుటేరులు పారిస్తుంటాయి. దివంగత టీడీపీ నేత పరిటాల రవీంద్ర బతికివున్న రోజుల్లో ఇక్కడ రాజకీయం వేరుగా వుండేది. ఆయన మరణం తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చినా.. కొందరు నేతలు ఇప్పటికీ హత్యా రాజకీయాలు నడిపిస్తున్నారు. రాష్ట్రంలోని అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో ధర్మవరం ఇప్పటికీ కొనసాగుతుండటం దురదృష్టకరం. 

ధర్మవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీకి కంచుకోట :

1955లో ఏర్పడిన ధర్మవరం నియోజకవర్గం తొలి నుంచి జనరల్ కేటగిరి కింద వుంటూ వస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఈ సెగ్మెంట్ కంచుకోట. 1983 నుంచి 2004 వరకు టీడీపీకి ధర్మవరంలో ఎదురులేకుండా పోయింది. అయితే 2009లో కేతిరెడ్డి ఎంట్రీతో తెలుగుదేశం జైత్రయాత్రకు బ్రేక్ పడింది. తిరిగి 2004లో వరదాపురం సూరి మరోసారి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఆ పార్టీ ధర్మవరంలో 7 సార్లు, కాంగ్రెస్ పార్టీ 5 సార్లు , ఇతరులు రెండు సార్లు, వైసీపీ ఒకసారి గెలిచాయి.

ఈ సెగ్మెంట్ పరిధిలో ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలున్నాయి. కమ్మ, రెడ్డి సామాజికవర్గాలకు చెందిన నేతలే ధర్మవరంలో ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2,40,323 మంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి 1,06,909 ఓట్లు పోలవ్వగా.. టీడీపీ అభ్యర్ధి వరదాపురం సూరికి 91,243 ఓట్లు వచ్చాయి. మొత్తం కేతిరెడ్డి 15,666 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ధర్మవరం శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. మరో విజయంపై కేతిరెడ్డి కన్ను :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. ధర్మవరంలో మరోసారి గెలవాలని కేతిరెడ్డి ధీమాగా వున్నారు. నియోజకవర్గంలో మంచి గుర్తింపు వుండటం, గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుండటంతో ఆయనపై ఓటర్లలో మంచి అభిప్రాయమే వుంది. కూటమి విషయానికి వస్తే.. తన కంచుకోటలో తిరిగి పాగా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ ధర్మవరం టికెట్ ఆశించగా.. కుటుంబానికి ఒక్క టికెట్ అన్న సూత్రం మేరకు రాప్తాడుకే పరిమితమవ్వాలని చంద్రబాబు సూచించారు. అయితే జనసేన, బీజేపీలు ధర్మవరం సీటు కోరుతూ వుండటంతో కసరత్తు చేస్తున్నారు. బీజేపీలో వున్న వరదాపురం సూరికి టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.  


 

click me!