మూడు రాజధానులపై రాజీనామాల ప్లాన్.. అమరావతి పాదయాత్రకు కౌంటర్‌గా వైసీపీ భారీ స్కెచ్..!

By Sumanth KanukulaFirst Published Oct 22, 2022, 9:52 AM IST
Highlights

మూడు రాజధానులే తమ విధానమని స్పష్టం చేస్తున్న వైసీపీ సర్కార్.. ఈ అంశాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దమవుతుంది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఆ ప్రాంత రైతులు చేపట్టిన పాదయత్ర విశాఖపట్నంకు చేరువవుతున్న వేళ.. వారికి గట్టి కౌంటర్ ఇవ్వాలని వైసీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. 

మూడు రాజధానులే తమ విధానమని స్పష్టం చేస్తున్న వైసీపీ సర్కార్.. ఈ అంశాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దమవుతుంది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఆ ప్రాంత రైతులు చేపట్టిన పాదయత్ర విశాఖపట్నంకు చేరువవుతున్న వేళ.. వారికి గట్టి కౌంటర్ ఇవ్వాలని వైసీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం వైసీపీ నేతుల రాజీనామాలతో వ్యుహాం సిద్దం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే రైతుల పాదయాత్ర ముగిసిన వెంటనే.. జేఏసీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర నుంచి అమరావతికి పాదయాత్ర చేపట్టేలా ప్రణాళికలను రచిస్తున్నట్టుగా సమాచారం. 

ఈ క్రమంలోనే అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు ఎదురుదాడిని ముమ్మరం చేసిన సంగతి తెలసిందే. రాజీనామాలు చేయనున్నట్టుగా కూడా కొందరు ప్రకటించారు. ఇప్పటికే తాను మంత్రి పదవికి రాజీనామా చేసి.. మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా ఉద్యమంలోకి రావాలని ఉందని కొద్ది రోజుల క్రితం మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయాన్ని మంత్రి ధర్మాన.. సీఎం జగన్‌కు వద్ద ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. 

Latest Videos

తాడేపల్లిలో శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన మంత్రి ధర్మాన ప్రసాదరావు.. తాను రాజీనామా చేసి, వికేంద్రీకరణకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నట్టుగా చెప్పినట్టుగా సమాచారం. మరికొందరు వైసీపీ ముఖ్య నాయకులు కూడా ఇదే రకమైన ఆలోచనలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారని ప్రచారం కూడా వైసీపీ వర్గాల్లో సాగుతుంది. 

మంత్రులు, ముఖ్య నేతలు.. మూడు రాజధానుల కోసం రాజీనామా చేయడం ద్వారా ప్రజల దృష్టితో పాటు, మీడియాలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే వైసీపీ అధిష్టానమే ఈ రకమైన వ్యుహాన్ని సిద్దం చేసిందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్రపై వైసీపీ నాయకులు మొదటి నుంచి తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అది పెట్టుబడిదారులు, టీడీపీ ముసుగులో చేస్తున్న యాత్ర అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి యాత్రపై ఏ విధంగా స్పందించాలనే అంశాలపై మంత్రులు బొత్స సత్యానారాయణ, గుడివాడ అమర్‌నాథ్, దాడి శెట్టి రాజాలు పలు సందర్భాల్లో సమావేశమై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. పలు కార్యక్రమాలకు శ్రీకారం చూడుతున్నారు. 

ఇటీవల వికేంద్రీకరణకు మద్దతుగా, విశాఖకు పరిపాలన రాజధాని కోసం.. నాన్ పొలిటికల్ జేఏసీ విశాఖ గర్జన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అది నాన్ పొలిటికల్ జేఏసీ అని చెప్పినప్పటికీ.. ఆ కార్యక్రమం మొత్తాన్ని వైసీపీ తెర వెనక ఉండి నడిపించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ మంత్రులు, ముఖ్య నాయకులు.. అమరావతి రైతుల పాదయాత్రపై, టీడీపీపై విమర్శలు చేశారు. అదే సమయంలో మూడు రాజధానులే తమ  విధానమని.. రాయలసీయ, దక్షిణ కోస్తా ప్రజలు కూడా విశాఖ పరిపాలన రాజధాని కావాలని కోరుకుంటున్నారని కూడా కొందరు నేతలు ప్రకటించారు. 

ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తాము రాజీనామాలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్టుగా ప్రకటించారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామాను నాన్ పొలిటికల్ జేఏసీకి అందజేశారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని ప్రకటించారు. ఇప్పుడు ధ్మర్మాన ప్రసాదరావు ఏకంగా.. సీఎం జగన్‌ను కలిసి రాజీనామా చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా మీడియాకు సీఎంవో వర్గాల నుంచి లీక్‌లు వచ్చాయి. ఈ పరిణామాలను గమనిస్తే.. అమరావతి రైతుల పాదయాత్ర విశాఖ చేరుకునేసరికి వైసీపీ ఎదురుదాడిని మరింత తీవ్రతరం చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 
మంత్రులు, కీలక నేతలు రాజీనామాలను తెర మీదకు తీసుకురావడం ద్వారా.. అమరావతి రైతుల యాత్రను చిన్నదిగా చూపెట్టేందుకు వైసీపీ స్కెచ్ రెడీ చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించాలని భావిస్తున్న రివర్స్ పాదయాత్ర‌లో వైసీపీ నేతలు కీలకంగా వ్యహరించే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. 

click me!