
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని మన దేశం నుంచే కాకుండా.. విదేశాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకుంటారు. కొందరు భక్తులు శ్రీవారికి పెద్ద మొత్తంలో విరాళాలు కూడా అందజేస్తుంటారు. తాజాగా తిరుమల శ్రీ వారికి భక్తులు భారీగా విరాళాలు అందజేశారు. తమిళనాడుకు చెందిన పలువురు భక్తులు స్వామి వారికి రూ. 10 కోట్లు విరాళం అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఒక్కరోజులో అందిన అత్యధిక విరాళాలు ఇవే కావడం గమనార్హం.
విరాళాల విషయానికి వస్తే.. తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన గోపాల్ బాల కృష్ణన్.. శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన 7 కోట్ల రూపాయల విరాళం అందించారు. శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్, శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్, బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ (BIRRD), శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయస్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ (SVBC).. ఇలా ఏడు ట్రస్టులకు రూ. కోటి చొప్పున మొత్తం రూ. 7 కోట్ల విరాళం అందజేశారు.
మరోవైపు తిరునెల్వేలికే చెందిన ఏ స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్‌స్పెక్షన్ ప్రైవేట్ లిమిటెట్ సంస్థ.. శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్‌కు రూ. 1 కోటి విరాళం అందించగా, తిరునల్వేలికి చెందిన Balakrishna Fuel Station కూడా శ్రీ వాణి ట్రస్టుకు రూ. 1 కోటి విరాళం అందించింది. అదే తిరునెల్వేలికే చెందిన Sea- Hub Inspection Services సంస్థ ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్టుకు రూ. కోటీ విరాళాన్ని అందజేసింది. ఇలా ఒకే రోజు రూ. 10 కోట్ల విరాళాలు టీటీడీకి అందాయి.
దాతలు విరాళాలకు సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్‌లను(డీడీలు) టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి.. ఆదివారం తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. Donor Cell డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పద్మావతి కూడా హాజరయ్యారు.
ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం రోజున శ్రీవారిని 78,188 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 35,427 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. దర్శనానికి సుమారుగా 8 గంటల సమయం పడుతుందని తెలిపింది.