కలిసి పనిచేస్తాం.. మైలవరంలో ఒక్కటైన దేవినేని - బొమ్మసాని, వసంతకు సెగ తప్పదా..?

By Siva Kodati  |  First Published Mar 3, 2024, 4:22 PM IST

మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్‌కు టికెట్ ఖరారైనా.. దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు వర్గాలు ఆయనకు సహకరిస్తాయా అన్నది చర్చనీయాంశమైంది.  వసంతకు చెక్ పెట్టేందుకే ఇద్దరు ఏకమయ్యారే టాక్ నడుస్తోంది. 


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానంగా మైలవరంలో టికెట్ విషయంలో తెలుగుదేశం పార్టీ నాన్చుడు ధోరణితో అక్కడి ప్రజల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. మైలవరం టికెట్‌ను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకే కేటాయిస్తారని నిన్న మొన్నటి వరకు వున్న అభిప్రాయం. కానీ ఎప్పుడైతే సిట్టింగ్ ఎమ్మెల్యే , వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారో అప్పటి నుంచి ఉమకు సెగ మొదలైంది. టీడీపీ జనసేనలు ప్రకటించిన తొలి జాబితాలో సీనియర్ నేత అయిన ఉమా పేరు మిస్సయ్యింది. ఆ వెంటనే చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు కూడా. అధినేత నుంచి వచ్చిన హామీ మేరకు అప్పటికి ఆయన సైలెంట్ అయినా జరుగుతున్న పరిణామాలతో ఉమలో భయం పోలేదు.

ఇలాంటి పరిణామాల మధ్య ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. ఆయనకు దాదాపుగా మైలవరం టికెట్ ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ దేవినేని ఉమాతో పాటు టికెట్ ఆశించిన బొమ్మసాని సుబ్బారావులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తొలుత దేవినేని, బొమ్మసాని వర్గాల మధ్య ఆధిపత్య పోరు వుండగా.. ఇప్పుడు వసంత టీడీపీలోకి రావడంతో ఆ లెక్కలన్నీ మారి.. ఇద్దరు నేతలు చేతులు కలిపి ఒకే వేదికపైకి వచ్చారు. వసంతకు చెక్ పెట్టేందుకే ఇద్దరు ఏకమయ్యారే టాక్ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ కోసం కలిసి పనిచేస్తామని కేడర్‌కు స్పష్టం చేశారు. రేపు ఎన్నికల శంఖారావం, యువగళంలోనూ కలిసి పాల్గొంటామని వారు తెలిపారు. 

Latest Videos

వసంత కృష్ణ ప్రసాద్‌కు టికెట్ ఖరారైనా.. దేవినేని, బొమ్మసాని వర్గాలు ఆయనకు సహకరిస్తాయా అన్నది చర్చనీయాంశమైంది. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, అందరినీ కలుపుకుని వెళ్తానని వసంత అంటున్నా.. ఇప్పుడు ఇద్దరు నేతలు ఒక్కటి కావడంతో చంద్రబాబు మైలవరం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. 

click me!