వద్దంటూనే విధ్వంసమా..? జగన్ తప్పులో బాబు కాలేస్తున్నాడా..?: ఎడిటర్స్ కామెంట్

By Venugopal Bollampalli - Editor  |  First Published Jun 23, 2024, 2:24 PM IST

గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన తప్పుల్నే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం కూడా చేస్తోందా? వైసీపీ పాలన తీరునే బాబు కంటిన్యూ చేయబోతున్నారా? మరి తాజాగా మంగళిరి తాడేపల్లి పరిధిలోని వైఎస్సార్‌సీపీ భవనాన్ని అంత హడావుడిగా ఎందుకు కూల్చేసినట్లు?


వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు అత్యంత దారుణంగా ఓడించి ఆ పార్టీ వాళ్లను ఛీత్కరించారు. ఇంకా వారి గురించి ఆలోచించడం కన్నా.. తమను నమ్మి చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ మెజారిటీ అప్పగించిన ప్రజల గురించి ఆలోచిద్దాం.. అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. మరి ఇది కూటమి ప్రభుత్వానికి ఎక్కుంతోందా? లేక గత ప్రభుత్వంలాగానే కక్ష పూరితంగా ప్రత్యర్థి వైసీపీ, ఆ పార్టీ నేతలపై అధికార జులు విదిలించాలని అనుకుంటోందా? తాజాగా జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. కూటమి ప్రభుత్వానికి కక్ష పూరితంగా చేసే ఆలోచన లేకపోయినా.. ప్రజలకు మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న అనుమానం కలుగుతోంది.

మొన్న అసెంబ్లీలో వైసీపీ వినతిని సాదరంగా ఆహ్వానించి అత్యంత హుందాగా జగన్‌కు పదవీ ప్రమాణం చేసుకునే వీలు కల్పించింది. తాను వెనుక గేటు నుంచి వచ్చినా.. వైసీపీ వినతి మేరకు చివర్లో కాకుండా మంత్రుల తర్వాత వెంటనే జగన్‌కు పదవీ ప్రమాణం అవకాశం కల్పించి హుందా తనం చాటుకుంది.
మరోవైపు నిర్మాణంలో ఉన్న వైసీపీ భవనాన్ని ఆఘమేఘాలమీద కూల్చేసింది. వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లినా.. కోర్టు నిబంధనల ప్రకారం నడచుకోమని ఆదేశించినా.. ఆలోపే భవనం కూల్చివేతను పూర్తి చేసింది. ఈ ఘటన ఇఫ్పుడు అత్యంత వివాదాస్పదమైంది. వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది.

Latest Videos

 

వాస్తవానికి ఏం జరిగింది..?
గుంటూరు జిల్లాలోని మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండు ఎకరాల భూమిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. భూమిని అప్పగించకుండానే నిర్మాణాలు ప్రారంభించడాన్ని ఉల్లంఘనగా పేర్కొని ఆమేరకు నోటీసులు ఇచ్చి, చర్యలు తీసుకున్నట్టు మంగళగిరి - తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. అయితే తమ కార్యాలయం నిర్మాణాన్ని కూల్చివేయడం ద్వారా టీడీపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్‌ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. 

మరి వైసీపీ వాదన ఏంటి..?
వైఎస్ఆర్‌సీపీ కార్యాలయ నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్న రెండెకరాలను కేటాయించింది. ఏడాదికి రెండు వేలు చొప్పున 33 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. అయితే ఈ చర్యను అప్పటి ప్రతిపక్ష టీడీపీ విమర్శించింది. విలువైన స్థలాన్ని నామమాత్రపు లీజు పేరుతో వైఎస్ఆర్‌సీపీ కాజేస్తోందని విమర్శించింది.

మరి సీఆర్‌డీఏ ఏమంటోంది..?
జూన్ 4 ఎన్నికల ఫలితాల తర్వాత అధికారం మారింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి ముందు జూన్ 10న సీఆర్‌డీఏ వైఎస్ఆర్‌సీపీ‌కి నోటీసులు ఇచ్చింది. వైఎస్ఆర్‌సీపీ కార్యాలయం పేరుతో అనుమతులు లేకుండా సాగుతున్న నిర్మాణాల వివరణ ఇవ్వాలని కోరింది. 2023, ఫిబ్రవరి 23న జారీ చేసిన జీఓ నంబర్ 52 ప్రకారం తాడేపల్లి బోట్ యార్డు స్థలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. అదే సమయంలో ఇరిగేషన్ అనుమతులు తీసుకోవాల్సి ఉందని ప్రస్తావించారు. ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుండానే భవన నిర్మాణం మొదలైందని సీఆర్‌డీఏ పేర్కొంది. ఎన్నికల ఫలితాలకు ముందే మే 20, జూన్ 1 తేదీలలో రెండు నోటీసులు జారీ చేసినట్టు సీఆర్డీయే తెపలింది. జూన్ 10న నిర్మాణం కూల్చివేత నోటిసులు ఇచ్చినా వైఎస్ఆర్‌సీపీ స్పందించలేదని సీఆర్‌డీఏ పేర్కొంది. సీఆర్‌డీఏ చట్టం సెక్షన్ 115 ప్రకారం అక్రమ నిర్మాణాలు కూల్చేసే హక్కు ఉందని, దాని ప్రకారమే చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.

ఇలా చేసుంటే హుందాగా ఉండేది...
సీఆర్డీయే చెబుతున్నట్లు వైసీపీ సరైన అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేస్తున్నపుడు.. కోర్టుకు వెళ్లి కోర్టు ఆదేశాల ప్రకారం కూల్చివేత చర్యలు చేపట్టి ఉంటే చాలా హుందాగా ఉండేది. కాని ఇప్పుడు కోర్టు కూల్చివేత ఆదేశాలు ఇవ్వలేదు.. కూల్చివేత నోటీసులపై వైసీపీ కోర్టుకు వెళ్లింది.. అలాంటపుడు కోర్టు ఆదేశాలు వచ్చేవరకు వేచి ఉంటే ఈ చర్య కక్షపూరితంగా చేసి ఉన్నా హుందాగా ఉండేదన్న వాదన వినిపిస్తోంది.

జగన్ చేసిన తప్పులే ఇఫ్పుడు బాబు చేస్తున్నారా..?
గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చివేసిందని.. దీనికి ప్రతిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యాలయాన్ని కూల్చేసి కక్ష తీర్చుకుంటోందని భావించాల్సి వస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వ తీరును ప్రజలకు తీవ్రంగా తిరస్కరించారు. అందువల్లే కూటమి ప్రభుత్వానికి అత్యంత భారీ మెజారిటీని కట్టబెట్టారు. మరి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కూడా అలాంటి చర్యలే తీసుకుంటే.. గత ప్రభుత్వ తీరును కంటిన్యూ చేస్తే.. ఎన్ని పథకాలు అమలు చేసినా.. ఎన్ని హామీలు నెరవేర్చినా.. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వ సుదీర్ఘ లక్ష్యాలకు అంత మంచిది కాదు.

రుషికొండలాగా ఎండగట్టాలి...
వైసీపీ ప్రభుత్వం గనులు, ఇసుక, ఇతరత్రా అంశాల్లో చాలా అవినీతి చేసిందని.. ఇఫ్పటికిప్పుడు అది అంచనాలకు కూడా అందనంత లోతుగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. రుషికొండ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ ఇష్టారీతన ఎలా ఖర్చుపెట్టిందో బహిర్గతం చేసింది. చంద్రబాబు నాయుడు పేర్కొంటున్నట్లు వైసీపీ ప్రభుత్వం తీవ్రమైన అవినీతికి పాల్పడి ఉంటే దాన్ని ప్రజల ముందు పెట్టి.. నిబంధనల ప్రకారం.. న్యాయపరంగా చర్యలు తీసుకుంటే హుందాగా ఉంటుంది. అలా కాకుండా ప్రతిపక్షం చెబుతున్నట్లు లోకేశ్ రెడ్ బుక్ ప్రకారం వెళ్తే కూటమికి ప్రభుత్వానికి ప్రజలు రెడ్ సిగ్నల్ వేసే అవకాశం లేకపోలేదు.

జనసేన తాజా పరిణామాలపై అంశాలపై న్యూట్రల్ గా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరు చూస్తోంటే.. ఆయన ఇష్టారీతిన కాకుండా వీలైనంత వరకు ప్రజలకు మేలు చేసేలా.. వారి కష్టాలను తీర్చేలా పాలన సాగించాలని భావిస్తున్నారు. అలాంటి తరుణంలో ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వైసీపీ పై కక్ష సాధింపు చర్యలకు దిగితే జనసేన సానుకూలంతా అయితే స్పందించే అవకాశం లేదు. అలాంటపుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల మధ్య విబేధాలు వచ్చే అవకాశమూ లేకపోలేదు. పవన్ భావిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకన్నా ప్రజా సంక్షేమంపై ఎక్కువ దృష్టి సారిస్తే మరో దశాబ్దం పాటు వైసీపీకి అధికారం దక్కే అవకాశమే లేదు. లేకుంటే చేజేతులా వీళ్లే మళ్లీ జగన్‌కి అధికారం కట్టబెట్టవచ్చు. వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోయినా.. ఇప్పటికే ఆ పార్టీకి 40 శాతం ఓటింగ్ ఉండటాన్ని విస్మరించలేం.

- వేణుగోపాల్ బొల్లంపల్లి | ఏసియానెట్ న్యూస్ తెలుగు ఎడిటర్ (Ex. BBC, Big Tv, Microsoft News, Eenadu)

click me!