జగన్ కు ఆకర్షణ శక్తి ఉంది

First Published Oct 24, 2017, 6:39 PM IST
Highlights
  • ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి జనాలను బాగానే ఆకర్షిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి అంగీకరించారు.
  • ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ, జగన్ తీసిపారేయదగ్గ నేత కాదన్నారు.

ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి జనాలను బాగానే ఆకర్షిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ, జగన్ తీసిపారేయదగ్గ నేత కాదన్నారు. జనాకర్షక శక్తి ఉంది కాబట్టి జగన్ ను లెక్కలోకి తీసుకోకుండా ఉండలేమని కూడా అన్నారు. అయితే అదే సమయంలో జగన్ ఇబ్బందులు కూడా అందరికీ తెలిసిందేనన్నారు. ఆ ఇబ్బందుల నుండి బయటపడేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారు అన్నదే ప్రధానమన్నారు.

ఇబ్బందుల నుండి బయటపడేందుకు కేంద్రంలోని పెద్దలతో ఏదైనా సర్దుబాటు చేసుకుంటున్నారా అన్న అనుమానం వస్తోందన్నారు. వైసీపీ నుండి పలువురు ఎంఎల్ఏలు ఎందుకు బయటకు వచ్చేస్తున్నారన్న విషయం చెప్పాలంటే ఆ పార్టీని దగ్గర నుండి గమనించాలని చెప్పారు. అయితే, బయటకు వచ్చేయాలనుకున్న ఎంఎల్ఏలు చేసే ఆరోపణల్లో ఎంత నిజం అన్నదే అనుమానంగా ఉందన్నారు.

కేంద్రం గురించి మాట్లాడుతూ, చంద్రబాబుకు ప్రధానమంత్రి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదన్న విషయంలో తమకు బాగా ఆందోళనగా ఉందన్నారు. కలిసి కాపురం చేద్దామని తాము అనుకుంటున్నా మోడి వైఖరే తమకు అర్ధం కావటం లేదని వాపోయారు. మోడిలో ఏదో వింత ప్రవర్తన ఉందని కెఇ అనుమానం వ్యక్తం చేసారు.

కెఇ చెప్పిందంతా బాగానే ఉందికానీ అసలు జగన్ ఆకర్షణ శక్తి గురించి ఎందుకు మాట్లాడారన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. ఒకవైపు మంత్రులు, నేతలు అందరూ కూడబలుక్కుని జగన్ పై ఆరోపణలతో దండెత్తుతుంటే కెఇ మాత్రం జగన్ గురించి పాజిటివ్ గా మాట్లాడటం పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు.

click me!