ఢిల్లీ లిక్కర్ స్కామ్: అటు విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట గైర్హాజరు.. ఇటు రాఘవరెడ్డికి రిమాండ్‌ పొడిగింపు

By Sumanth KanukulaFirst Published Mar 18, 2023, 3:45 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. మరోవైపు ఈ కేసులో శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి మార్చి 18న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేయగా.. ఆయన విచారణకు దూరంగా ఉన్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్య పరిస్థితి బాగాలేకపోవడం వల్ల విచారణకు రావడం లేదని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన న్యాయమూర్తుల ద్వారా ఈడీ అధికారులకు సమాచారం పంపినట్టుగా తెలుస్తోంది. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి విచారణకు హాజరుకాకపోవడంపై ఈడీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. 

మరోవైపు ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మార్చి 28 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు వెలువరించింది. ఇక, మాగుంట రాఘవరెడ్డి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు. ఈ కేసులో మాగుంట రాఘవ రెడ్డిని గత నెలలో ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థల అధికారులు మాగుంట రాఘవరెడ్డిని విచారించారు. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ప్రమేయాన్ని ఆడిటర్ బుచ్చిబాబు ధృవీకరించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి హవాలా ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) రూ. 100 కోట్లు చెల్లించేందుకు కవిత ఏర్పాట్లు చేశారని ఈడీ ఆరోపించింది.

ఫిబ్రవరి 23న నమోదైన బుచ్చిబాబు వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ.. కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాల మధ్య రాజకీయ అవగాహన ఉందని ఈడీ పేర్కొంది. కవిత 2021 మార్చి 19, 20 తేదీల్లో ఢిల్లీలోని గౌరీ అపార్ట్‌మెంట్స్‌లో కేజ్రీవాల్, సిసోడియా ప్రతినిధి విజయ్ నాయర్‌ని కలిశారని తెలిపింది. ఈ సందర్బంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తాము ఏమి చేయగలమో కవితకు విజయ్ నాయర్ వివరించే ప్రయత్నం చేరని.. మద్యం పాలసీలో, మద్యం వ్యాపారంలో కవితకు చేసే సహాయానికి బదులుగా ఆప్‌కు కొంత నిధులు ఇవ్వాలని ప్రతిపాదించారని పేర్కొంది. 

click me!