‘ఫిరాయింపు’ ఎంఎల్ఏలకు అవమానం

First Published Jan 12, 2018, 4:08 PM IST
Highlights

ఫిరాయింపు ఎంఎల్ఏలు అన్నీ విధాలుగానూ చెడినట్లే కనబడుతోంది

ఫిరాయింపు ఎంఎల్ఏలు రెండు విధాలుగా చెడినట్లే కనబడుతోంది. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో 23 మంది ఎంఎల్ఏలు టిడిపిలోకి షిరాయించిన సంగతి తెలిసిందే. అదే వారిపాలిట ఇపుడు శాపంగా మారింది. నియోజకవర్గ అభివృద్ధి అనే ముసుగు వేసుకున్నా వారెందుకు పార్టీ ఫిరాయించారో అందరికీ తెలిసిందే. ఇపుడు వారికి ఎదురైన సమస్య ఏమిటంటే, పార్టీ ఫిరాయించినందుకు నియోజకవర్గంలో జనాలు నిలదీస్తున్నారు. అదే సమయంలో టిడిపిలోని సీనియర్ నేతలు, కార్యకర్తలూ వారిని కలుపుకుని వెళ్ళటం లేదు. దాంతో ‘రెంటికి చెడ్డ రేవడిగా’ మారిపోయింది వారి వ్యవహారం.

రాష్ట్రమంతా జన్మభూమి కార్యక్రమం పదిరోజుల పాటు జరిగింది. చాలాచోట్ల వివాదాలు, ఘర్షణలతోనే ముగిసింది. టిడిపి నేతల మధ్య ఆధిపత్య వివాదాలు, టిడిపి-భాజపా నేతల మధ్య గొడవలు కూడా జరిగాయి. వాటిని పక్కనపెడితే ఫిరాయింపు ఎంఎల్ఏల పరిస్దితే దయనీయంగా తయారైంది.

అద్దంకి, కదిరి, బద్వేలు, గూడూరు, కందుకూరు, పాతపట్నం, పామర్రు, ప్రత్తిపాడు, కోడూమూరు, జమ్మలమడుగు, పలమనేరు లాంటి నియోజకవర్గాల్లో ఫిరాయింపులకు చుక్కెదురైంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలను పై  నియోజకవర్గాల్లో జనాలు తీవ్రంగా వ్యతిరికేంచారు.

ఫిరాయించిన ఎమ్మెల్యేలపై టిడిపి నేతలు అసమ్మతితో రగిలిపోతున్నారు. అందుకనే జన్మభూమి కార్యక్రమాల్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దానికితోడు వైసిపికి ఓట్లు వేసి గెలిపించిన జనాలు కూడా ఫిరాయింపులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దాంతో ఎవరికీ ఏమీ సమాధానం చెప్పుకోలేక ఫిరాయింపు ఎంఎల్ఏలు కార్యక్రమం మధ్యలోనే వెళ్ళిపోతున్నారు.

కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ పరిస్థితి అయితే మరీ దయనీయంగా తయారైంది. తాజా జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లినపుడు గ్రామంలోకే రానీయలేదు. వైఎస్సార్‌ జిల్లా బద్వేలు ఎమ్మెల్యే తిరువీధి జయరాములు, కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అత్తారు చాంద్‌బాష,  మంత్రులు ఆదినారాయణరెడ్డికి, ఎన్‌.అమరనాథరెడ్డికి, భూమా అఖిలప్రియకు  అసమ్మతి చాపకింద నీరులాగా విస్తరిస్తోంది.

గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డికి ప్రజలు కోడిగుడ్లతో కొట్టిన ఘటన అందరికీ తెలిసిందే.  యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజుకూ టడిపి కార్యకర్తలకు మధ్య కాంట్రాక్టుపనుల విషయంలో తేడాలున్నాయంటున్నారు. కాంట్రాక్టు పనులను ఎక్కువగా తొలి నుంచీ తన వెంట ఉన్నవారికి డేవిడ్‌రాజు ఇస్తూ టీడీపీలో ఉన్న పాత నేతలను విస్మరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

click me!