
అనంతపురం : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. అత్త గొంతును వైరుతో బిగించి హత్య చేసింది ఓ కోడలు. అనంతపురంలోని ఆజాద్ నగర్ లో ఈ ఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భాషా, ఉమేరా సుల్తానా దంపతులు. వీరిద్దరూ ఆజాద్ నగర్ లోని ఓ ఇంట్లో ఉంటున్నారు. వీరి దగ్గరే అత్త మామ సర్దార్ భీ (57), ఇస్మాయిల్ ఉంటున్నారు. భర్త భాషా స్థానిక మార్కెట్ యార్డ్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. సుల్తానా గృహిణి.
భాషా, ఉమేరా సుల్తానా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కాగా, అత్త సర్దార్ భీ తన కూతురు పిల్లలను కూడా తమ వద్దనే ఉంచు కుంటుంది. ఒక కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టమవుతున్న నేటి కాలంలో ఆడపడుచు పిల్లలను కూడా పోషించాల్సి రావడంతో సుల్తానా ఇబ్బందిగా ఫీల్ అయ్యేది. దీనికి తోడు ప్రతి విషయానికి అత్త తన మీద గట్టిగా అరవడం, మందలిస్తుండడం చేసేది. ఈ మనోవేదనతో కుమిలిపోయేది. సుల్తానా సోదరుడు వలీ గుంతకల్లులో ఉంటున్నాడు. ఒకసారి ఈ విషయాన్ని తన సోదరుడు వలీకి చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేసింది ఆమె. ఇక ఈ వేదనతో అత్తింట్లో కాపురం చేయడం తన వల్ల కాదని వాపోయింది.
షాకింగ్.. వెంటపడి వేధించిన వ్యక్తిని చేతులు కట్టేసి.. కత్తితో పొడిచి చంపేసిన యువతి..
చచ్చిపోవాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. చెల్లెలి కష్టాలు విన్న ఆ అన్న సర్ది చెప్పలేదు సరి కదా.. దారుణమైన ఆలోచన చేశాడు. నువ్వు చనిపోతే ఎలా? పిల్లల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించాడు. చనిపోవాల్సింది నువ్వు కాదు మీ అత్తనే చంపేద్దామన్నాడు. దీని ప్రకారమే వారిద్దరూ కలిసి అతను చంపడానికి పథకం వేశారు. భర్త బాషా మంగళవారం రాత్రి మార్కెట్ యార్డులో డ్యూటీకి వెళ్ళాడు. ఆ తర్వాత పదిన్నర గంటలకు వలి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఇంట్లోనే వాషింగ్ మిషన్ కు ఉన్న వైరుతో అప్పటికే నిద్రపోయిన సర్దార్ భీ గొంతుకు చుట్టి అన్నా చెల్లెలు ఇద్దరు చెరోవైపులాగారు. దీంతో ఊపిరాడక సర్దార్ భీ చనిపోయింది.
ఆమె ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్న తర్వాత వలి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అత్త చనిపోయిన తర్వాత హత్య చేసిన విషయం తమ మీదికి రావద్దని సుల్తానా అనుకుంది. దీనికోసం మరో నాటకానికి తెరతీసింది. గుర్తు తెలియని దొంగలు అతను హత్య చేసినట్లుగా చిత్రీకరించాలని చూసింది. ఈ క్రమంలోనే అత్త మెడలోని బంగారు గొలుసును, తన మెడలోని పుస్తెలతాడును తెంపుకొని.. ఆ తర్వాత భర్తకు ఫోన్ చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఇంటి మీద దాడి చేశారని.. తమ మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారని.. ఈ క్రమంలో మీ అమ్మను చంపేశారు అంటూ తెలిపింది.
కంగారుపడ్డ భాష వెంటనే ఇంటి యజమానికి ఫోన్ చేసి విషయం తెలిపాడు. దీంతో ఆయన గట్టిగా కేకలు వేసుకుంటూ వచ్చాడు. ఆ కేకలకు కాలనీలోని వారంతా నిద్రలేచారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏం జరిగింది అంటూ సుల్తానాను అడిగారు. ఎవరో గుర్తు తెలియని వారు వచ్చారని, అత్తను చంపేశారని తెలిపింది. 100 కి ఫోన్ చేశారు. ఇన్చార్జి డిఎస్పి ఆర్ల శ్రీనివాసులు, అనంతపురం రూరల్ సీఐ భాస్కర్ గౌడ్, త్రీ టౌన్ సిఐ కత్తి శ్రీనివాసులు, నాలుగో పట్టణ సిఐ జాకీర్ హుస్సేన్లు రంగంలోకి దిగారు. హత్యకు దారి తీసిన కారణాల మీద ఆరా తీశారు.
అయితే కోడలు చెబుతుంది కట్టుకథ అని.. సర్దార్ భీని గుర్తు తెలియని వ్యక్తులు చంపలేదని నిర్ధారించారు. అనుమానంతో సుల్తానాను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. వారి విచారణలో ఆమె అసలు నిజం తెలిపింది. దీంతో ఆమెతోపాటు ఆమెకు సహకరించిన సోదరుడు వలిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారిద్దరి మీద కేసు నమోదు చేశారు.