అన్న చనిపోయిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే తమ్ముడు కూడ చనిపోయాడు. ఇద్దరు గుండెపోటుతో మరణించడం ఆ కుటుంబంలో విషాదం నింపింది.
గుంటూరు: అన్న చనిపోయిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే తమ్ముడు కూడ చనిపోయాడు. ఇద్దరు గుండెపోటుతో మరణించడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. గుంటూరు జిల్లా కేంద్రంలోని పాతిమాపురానికి చెందిన షేక్ అబ్దుల్ నబీ నివాసిస్తున్నాడు.
ఆయన వయస్సు 40 ఏళ్లు. స్థానికంగా ఉండే ఓ బేకరిలో ఆయన పనిచేస్తున్నాడు. మంగళవారం నాడు ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.
నబీకి తమ్ముడు కూడ ఉన్నారు. ఆయన పేరు దస్తగిరి. ఆయన వయస్సు 38 ఏళ్లు. ఆసుపత్రికి అన్నను తీసుకెళ్లిన సమయంలో దస్తగిరి కూడ ఉన్నారు. వైద్యులు పరీక్షించి నబీ చనిపోయాడని చెప్పగానే అక్కడే ఉన్న దస్తగిరి కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్యులు అతడికి చికిత్స అందించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దస్తగిరి కూడ మరణించాడు. దస్తగిరికి కూడ గుండెపోటు వచ్చినట్టుగా వైద్యులు చెప్పారు. నబీకి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. దస్తగిరికి కూడ భార్య, ఇద్దరు పిల్లలున్నారు.ఒకే కుటుంబంలో ఇద్దరు నిమిషాల వ్యవధిలో మరణించడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.