
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవిశరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 5వ తేదీ వరకూ పది రోజులు అమ్మవారు వివిధ అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. నేడు తొలి రోజు కనకదుర్గ అమ్మవారు స్వర్ణకవచలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ రోజు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్‌కు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఈవో భ్రమరాంబ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నట్టుగా చెప్పారు.
ఇక, శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టుగా దుర్గగుడి ఈవో భ్రమరాంబ తెలిపారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన కనకదుర్గ అమ్మవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుకోనున్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా అక్టోబర్ 5న దుర్గాదేవిని హంసవాహనంపై కృష్ణా నదిలో ఊరేగించున్నారు.