
మంగళగిరి : వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంంటీర్ వ్యవస్థపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏపీలో అమ్మాయిల మిస్సింగ్ కు వాలంటీర్లే కారణమంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరిస్తున్న కొందరు వాలంటీర్లు ఆ సమాచారాన్ని వైసిపి నాయకులకు ఇస్తున్నారంటూ పవన్ ఆరోపణలు చేసారు. ఇలా వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేసిన పవన్ పై వైసిపి నాయకులు మండిపడుతున్నారు. మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే తనదైన స్టైల్లో పవన్ కు కౌంటరిచ్చారు.
మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పర్యటించారు. ఈ క్రమంలోనే పవన్ వాలంటీర్ వ్యవస్థను అవమానించేలా మాట్లాడటంపై ఆర్కే స్పందించారు. ప్రజలకోసం పనిచేస్తున్న వాలంటీర్లను ప్రశంసించకపోయినా పరవాలేదు... అవమానించడం తగదంటూ పవన్ కు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ దళిత మహిళా వాలంటీర్ రజిత కాళ్లుకడిగారు ఎమ్మెల్యే. అనంతరం ఆమెకు శాలువా కప్పి, పూలదండతో సత్కరించారు.
వీడియో
ప్రజాసేవ చేస్తున్న వాలంటీర్లపై ప్రతిపక్షాలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు వారినెంతో బాధిస్తున్నాయని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు. అందువల్లే వారికి మేమంతా అండగా వున్నామని చెప్పేందుకే మహిళా వాలంటీర్ ను సన్మానించినట్లు ఆయన తెలిపారు. వాలంటీర్ల సేవల వల్ల వైసిపి ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందన్న అక్కసుతోనే ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. తాజాగా పవన్ కల్యాణ్ వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేసారని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు.
Read More వాలంటర్లంటే వణుకు, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: పవన్ కు పేర్ని నాని కౌంటర్
ఇదిలావుంటే వాలంటీర్ వ్యవస్థపై తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న సమయంలోనే పవన్ కల్యాణ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు కూడా చెబుతున్నాను... వాలంటీర్ వ్యవస్థ చాలా ప్రమాకరమైనదని పవన్ అన్నారు. జగన్ ప్రభుత్వం వారికి కేవలం రూ.5 వేల జీతమిచ్చి రాష్ట్రంలోని ప్రతీ ఇంట్లోకి దూరేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. దీంతో వాలంటీర్లకు ప్రతిఒక్కరికి సంబంధించిన సున్నితమైన సమాచారమంతా తెలిసిపోతోందని అన్నారు. ప్రభుత్వ ఉద్దేశం ఎదైనప్పటికీ ఇలాంటి సున్నితమైన సమాచారం బయటకు వెళ్తే చాలా ప్రమాదం అని పవన్ అన్నారు.
ఏపీ ప్రజలందరూ వాలంటీర్ వ్యవస్థపై పట్ల జాగ్రత్తగా ఉండాలని పవన్ కల్యాణ్ సూచించారు.వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదు... కానీ వారు వైసిపికి అనుకూలంగా పనిచేయడమే అభ్యంతరకరమని అన్నారు. ముఖ్యంగా ఆడ పిల్లలు ఉన్న పేరెంట్స్ వాలంటీర్లతో జాగ్రత్తగా ఉండాలని పవన్ అన్నారు. ఒంటరిగా ఉంటున్న మహిళలు, వితంతువులకు భద్రత ఉందా లేదా అనే విషయాన్ని జనసేన వీర మహిళలు గమనిస్తూ ఉండాలని కోరారు. వాలంటీర్లు ఎవరి కోసం పని చేస్తున్నారో ప్రతిఒక్కరు గమనించాలని... మహిళల రక్షణని కూడా చూడాలని పవన్ కల్యాణ్ సూచించారు.