
భీమవరం : ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు... తియ్యని మాటలతో నమ్మించి ప్రేమలోకి దించాడు... అప్పుడెప్పుడూ అడ్డురాని కులం పెళ్లికి మాత్రం అడ్డొచ్చిందట. తనది అగ్రకులమని... నిమ్న కులానికి చెందిన యువతితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించరంటూ తప్పించుకునే ప్రయత్నం చేసాడు. దీంతో మోసపోయిన యువతి ఏడుస్తూ ఇంట్లో కూర్చోకుండా న్యాయం కోసం ప్రియుడి ఇంటిముందు ఆందోళనకు దిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా శ్రీరాంపురం పంచాయితీ శివనారాయణపురంకు చెందిన కొండేటి సాయి ఓ దళిత యువతి ప్రేమించుకున్నారు. గత నాలుగేళ్ళుగా వీరు ప్రేమించుకుంటుండగా ఇటీవల యువతి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చింది. దీంతో అతడి నిజస్వరూపం బయటపడింది. తక్కువ కులానికి చెందిన యువతిని పెళ్లాడేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోరని... వారిని ఎదిరించి పెళ్ళిచేసుకోలేనని తేల్చిచెప్పాడు.
ప్రాణంగా ప్రేమించినవాడు తక్కువ కులమంటూ అవమానిస్తూ పెళ్ళి నిరాకరించడాన్ని యువతి తట్టుకోలేకపోయింది. మోసపోయానని ఏడుస్తూ కూర్చోకుండా న్యాయం కోసం ప్రియుడి ఇంటిముందు ఆందోళనకు దిగింది యువతి. ప్రియుడి ఫోటోలతో కూడిన బ్యానర్లు అతడి ఇంటికి కట్టి అక్కడే మౌనదీక్ష చేపట్టింది. అగ్రకుల దురహంకారంతో పెళ్లికి నిరాకరించిన ప్రియుడు పెళ్లికి అంగీకరించే వరకు ఆందోళన విరమించబోనని యువతి తెలిపింది.
న్యాయపోరాటం చేస్తున్న యువతికి మాల మహానాడు, ఎమ్మార్పిఎఫ్ మద్దతుగా నిలిచింది. కులం పేరుతో దళిత బిడ్డను మోసగించాలని చూస్తున్నవాడికి గుణపాఠం చెబుతామని అన్నారు. యువతికి న్యాయం జరిగే వరకు అండగా వుంటామని... అవసరమైతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు.