జగన్ ఉచ్చులో చంద్రబాబు: దగ్గుబాటి వెంకటేశ్వర రావు తీవ్ర వ్యాఖ్య

First Published Jul 23, 2018, 8:18 AM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మీడియా ట్రాప్‌లో పడితే, జగన్‌ ఉచ్చులో ముఖ్యమంత్రి చంద్రబాబు పడ్డారని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. 

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మీడియా ట్రాప్‌లో పడితే, జగన్‌ ఉచ్చులో ముఖ్యమంత్రి చంద్రబాబు పడ్డారని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదని అన్న చంద్రబాబు ఇప్పుడు హోదా కావాలని అనడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు.

రాష్ట్రంలో అన్ని పార్టీలు ఎన్నికల కోసం యూట ర్న్‌ తీసుకున్నాయని అభిప్రాయపడ్డారు. అవిశ్వాసం పెట్టడం కేవలం పత్రికల్లో హెడ్‌లైన్స్‌ రాసుకోవడానికే పనికొచ్చిందని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు. కేవలం బీజేపీని వ్యతిరేకించాలనే ఓట్ల రాజకీయం మాత్రమే సాగుతోందని అన్నారు. 

బీజేపీని వ్యతిరేకిస్తేనే ఓట్లు పడతాయని రాష్ట్రంలోని పార్టీలు భావిస్తున్నాయని, దాంతో బీజేపీని వ్యతిరేకించడంలో పోటీపడుతున్నాయని అన్నారు. అసలు రాష్ట్రంలో బీజేపీకి ఓట్లే లేవని, ఇక వ్యతిరేకించి ఉపయోగం ఉండదని ఆయన అన్నారు.
 
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏడు ముంపు మండలాలను కేంద్రం ఏపీలో కలిపినా వివక్ష కొనసాగుతూనే ఉందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు హోదా పొడిగించలేదని స్పష్టంచేశారు. హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయనే అభిప్రాయం సరికాదని అన్నారు. 

ఢిల్లీని మించిన రాజధాని అమరావతికి కడతామని ప్రధాని తిరుపతిలో చేసిన ప్రకటనను కూడా ఆయన తప్పుబట్టారు. ప్రధాని స్థాయిలో దేశ రాజధానిని మించి కడతానని చెప్ప డం సరికాదని అన్నారు.పరిపాలన అంటే ప్రెస్‌మీట్‌లు పెట్టడం, దీక్షలు చేయడం కాదని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావలసినవాటిపై అధికారులతో చర్చించి ఢిల్లీ వెళ్లి అడగాలని సూచించారు. 

పార్టీలతో సంబంధం లేకుండా మేధావులు, పెన్షనర్లు, సంఘాలు, ప్రముఖులతో కలిసి రాజకీయేతర వేదికను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆనయ చెప్పారు.

click me!