ఏపీకి తిత్లీ ముప్పు: అప్పుడు ఇదే రోజుల్లో హుధూద్

By narsimha lodeFirst Published Oct 11, 2018, 11:52 AM IST
Highlights

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలను తిత్లీ తుఫాన్ వణికిస్తోంది. 


విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలను తిత్లీ తుఫాన్ వణికిస్తోంది. గురువారం నాడు  శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో  తిత్లీ తుపాన్ తీరం దాటింది. అయితే 20`14 అక్టోబర్ 12 వ తేదీన హుధూద్ తుఫాన్ విశాఖను తీవ్రంగా నష్టపర్చింది. 

2014 అక్టోబర్ 12వ తేదీన హుధూద్ తుఫాన్  విశాఖ సమీపంలో తీరం దాటింది.  ఈ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టం వాటిల్లింది.  అక్టోబర్‌లో బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈ తుపాన్ పెను నష్టాన్ని కల్గించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన హుధూద్  పెను తుఫాన్‌గా మారింది.

గోపాల‌పూర్‌కు ఆగ్నేయ దిశలో 750 కి.మీ దూరంలో తుఫాన్  2014 అక్టోబర్ 9వ తేదీన హుధూద్  కేంద్రీకృతమైంది. విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశలో 750 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై  36 గంటల్లో పెను తుఫాన్ గా మారింది. విశాఖపై  ఈ తుఫాన్  విరుచుకుపడింది.

2014 అక్టోబర్ 12వ తేదీన విశాఖ నగరాన్ని హుధూద్ నాశనం చేసింది. అయితే  ప్రస్తుతం తిత్లీ తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై కన్పిస్తోంది. ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాపై దీని ప్రభావం ఉంటుందని  వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు.

హుధూద్ తుఫాన్ కారణంగా గంటకు 180 కి.మీ వేగం కంటే ఎక్కువ వేగంతో  గాలులు వీచాయి. తిత్లీ తుపాన్ కారణంగా గంటలకు 140 నుండి 160 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. అయితే తీరం దాటిన మూడు గంటల వరకు  160 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. ఆ తర్వాత క్రమంగా గాలుల వేగం తగ్గనుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

తీరం దాటిన తర్వాత తుఫాన్  ఈశాన్య దిశలో  పయనిస్తోందని వాతావరణశాఖాధికారులు ప్రకటించారు. ఒడిశా మీదుగా తుఫాన్ బెంగాల్‌ వైపుకు దూసుకువెళ్తోందని చెప్పారు. తిత్లీ తుఫాన్  ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల్లో 6 గంటల వరకు ఉంటుంది. ఉదయం నాలుగున్నర.. ఐదున్నర గంటల మధ్య పలాస సమీపంలో తిత్లీ తుఫాన్ తీరం దాటింది. సముద్రంలో అలలు సాధారణంగా కంటే 1 మీటరు అదనంగా ఎత్తుకు ఎగిసిపడే అవకాశం ఉందని  అధికారులు ప్రకటించారు.

తుఫాన్ తీవ్రత తగ్గిన తర్వాత ఇళ్లలో నుండి జనం బయటకు రావాలని వాతావరణ శాఖాధికారులు ప్రకటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడ ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యలు తీసుకొంది.

click me!