
అమరావతి : ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల 18వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, ఇది క్రమేపీ బలపడి 20వ తేదీనాటికి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర వాయుగుండంగా బలపడి ఆంధ్రప్రదేశ్ దిశగా పయనించనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అది తుపానుగా, పెను తుపానుగా మారే అవకాశాలు ఎక్కువున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
కాగా, ఈ వాయుగుండం తుపానుగా మారితే దీన్ని ‘సిత్రాంగ్’ అని పిలుస్తారని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది సూపర్ సైక్లోన్ గా మారితే దీని ప్రభావం ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలపై కూడా అధికంగానే ఉంటుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కాగా, ‘సిత్రాంగ్’ అనే పేరును థాయ్ లాండ్ సూచించింది. థాయ్ భాషలో ‘సిత్రాంగ్’ అంటే ‘వదలనిది’ అని అర్థం. అయితే.. ఈ సిత్రాంగ్ తుపానుపై నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు కూడా అప్రమత్తంగా ఉన్నట్టు ట్విట్టర్ ద్వారా తెలుస్తోంది. తుపాను ప్రభావిత రాష్ట్రాలకు ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని మెస్సేజ్ కూడా అందింది.
విశాఖను వదిలి వెళ్లాలని పవన్ కి పోలీసుల వినతి:నోవాటెల్ హోటల్ వద్ద భారీ బందోబస్తు
ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్ప గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా శనివారం భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడ్డాయి. కుంభవృష్టితో కోనసీమ తడిసి ముద్దైంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చంపావతి, నాగావళి నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది.
ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు 4.33 లక్షల క్యూసెక్కులు విడుదల చేయడంతో బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఓలేరు, పల్లెపాలెం, పెదలంక, కాకుల డొంక, వద్ద కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, వర్షాల నేపథ్యంలో కృష్ణా, పెన్నా నదులు వరద ఉదృతితో ప్రవహించే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో వాగుల్లో కొట్టుకుపోతున్న ముగ్గురిని స్థానికులు కాపాడారు.