రేపు అర్దరాత్రి తీరం దాటనున్న మాండూస్ తుఫాన్.. హై అలర్ట్ ప్రకటించిన ఐఎండీ..

By Sumanth KanukulaFirst Published Dec 8, 2022, 5:10 PM IST
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ కారణంగా తమిళనాడులోని పలు ప్రాంతాలతో, దక్షిణ కోస్తా  జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 9 అర్ధరాత్రి పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట మధ్య మాండూస్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ కారణంగా తమిళనాడులోని పలు ప్రాంతాలతో, దక్షిణ కోస్తా  జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 9 అర్ధరాత్రి పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట మధ్య మాండూస్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. అది బుధవారం నాటికి చెన్నైకి 750 కి.మీ దూరంలో ఉంది. అయితే వాయుగుండం గురువారం తుఫాన్‌గా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు మాండస్‌గా నామకరణం చేశారు.

మాండూస్ తుఫాన్ కారైకాల్‌కు తూర్పు ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి డిసెంబర్ 9 అర్ధరాత్రి పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట మధ్య తీరం దాటుతుందని తెలిపింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 70 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేసింది. తమిళనాడులోని పలు జిల్లాలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

తమిళనాడు తీరప్రాంతం, పుదుచ్చేరి, కారైకాల్‌లోని పలు ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇక, తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. తుఫాన్ పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ గురువారం ఉదయం తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సమీక్ష నిర్వహించారు. బంగాళాఖాతంలో తుఫాన్ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వివిధ జిల్లాల కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు. తుఫాన్ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  తుపాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల్లో వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కలిగించాలని, వారికి సహాయకారిగా నిలవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. 

click me!