Cyclone Jawad: వాయుగుండంగా మారిన తుఫాను... ఏపీకి తప్పిన ముప్పు

By Arun Kumar PFirst Published Dec 5, 2021, 9:10 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ కు జవాద్ తుఫాను ముప్పు తప్పిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తీరంవైపు దూసుకువస్తున్న సమయంలో పరిస్థితులు అనుకూలించక తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారిందని ఐఎండి తెలిపింది.

విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జవాద్ తుఫాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫానుగా మారి ఉత్తరాంధ్ర‌-ఒడిషా తీరంవైపు దూసుకువస్తోందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సముద్రంలోనే జవాద్ తుఫాను బలహీనపడిందని... దీని వల్ల ఇక ఏపీకి పెద్దగా ముప్పేమీ వుండదని ఐఎండీ తెలిపింది.  

ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న cyclone jawad బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు ఐఎండి తెలిపింది.  ఇది ఉత్తర-ఈశాన్య దిశల వైపు కదిలి మధ్యాహ్నానికి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని ప్రకటించారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ప్రమాదకర స్థాయిలో కాకుండా ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశాలున్నాయని IMD తెలిపింది.

visakhapatnam కు తూర్పు-ఆగ్నేయంగా 180 కి.మీ, ఒడిషాలోకి గోపాల్‌పూర్ కి దక్షిణంగా 200 కి.మీ, పూరీకి నైరుతి-నైరుతి దిశలో 270 కి.మీ, పారాదీప్ కి నైరుతి-నైరుతి దిశలో 360 కి.మీ దూరంలో ప్రస్తుతం వాయుగుండం కేంద్రీకృతమై వుందని వాతావరణ శాఖ ప్రకటించింది.  

READ MORE  cyclone jawad : దిశ మార్చుకున్న జవాద్ తుపాన్.. ఉత్తరాంధ్రకు తప్పిన పెనుముప్పు, కానీ

జవాద్ తుఫాను బలహీనపడ్డప్పటికి తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కొనసాగనున్నాయని హెచ్చరించారు. కాబట్టి తీరప్రాంతాల్లో నివాసముండే ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. ఇవాళ ఉత్తరాంధ్ర, ఒడిస్సా తీరంలో వేటకు వెళ్లకూడదని మత్స్యకారులకు ఐఎండి సూచించింది. 

ఇప్పటికే ఏపీని భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్న సమయంలోనే బంగాళాఖాతంలో జవాద్ తుఫాను ఏర్పడింది. ఈ తుఫాను ఉత్తరాంధ్రలో వర్షబీభత్సం సృష్టించనున్నట్లు ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. 

read more  అప్పుల‌ ఊబిలో తెలుగు రాష్ట్రాల రైతుల ముందంజ‌..వివ‌రాలు వెల్ల‌డించిన కేంద్రం

తుఫాను ప్రభావిత ఉత్తరాంధ్రలో రెస్క్యూ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. విశాఖపట్టణంలో మూడు Ndrf బృందాలతో పాటు 45 మందితో Sdrf సిబ్బందిని రంగంలోకి దించారు. జీవీఎంసీ పరిధిలో 21 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. Visakhapatnam జిల్లాలోని ఏడు రిజర్వాయర్లలో అత్యవసర పరిస్థితుల్లో నీటిని విడుదల చేయడానికి ఇరిగేషన్ అధికారులను సిద్దం చేశారు.Gvmc, రెవిన్యూ, పోలీస్, పంచాయితీరాజ్, రోడ్లు భవనాల శాఖాధికారులతో సమన్వయం  చేసుకొంటూ  సహాయక చర్యలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  

తుఫాను ప్రభావంతో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటే చెట్లు విరిగిపడే ప్రమాదం ఉందని భావించి జేసీబీలతో పాటు చెట్లను కట్ చేసే యంత్రాలను కూడా సిద్దం చేసుకొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విశాఖలో control  రూమ్స్ ఏర్పాటు చేశారు. 0891-2590100,0891-2590102,0891-2750090,  నెంబర్లకు ఫోన్లు చేయాలని అధికారులు సూచించారు. 

ఇలా జవాద్ సైక్లోన్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగమంతా సిద్దమయ్యింది. ప్రజలు కూడా భయంతో వున్న సమయంలో ఐఎండి గుడ్ న్యూస్ చెప్పింది. జవాద్ తుఫాను బలహీనపడిందని... దీనివల్ల ముందుగా అనుకున్నంత ముప్పు వుండదని ఐఎండి తెలిపింది. దీంతో ప్రజలే కాదు అదికారులు ఊపిరి పీల్చుకున్నారు. 


 

click me!