సూపర్‌ సైక్లోన్‌గా ఫణి: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విధ్వంసం

By Siva KodatiFirst Published May 2, 2019, 8:50 PM IST
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫణి తుఫాను అలజడి సృష్టిస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఇది సూపర్ సైక్లోన్‌గా మారినట్లు వాతావరణశాఖ తెలిపింది. 

బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫణి తుఫాను అలజడి సృష్టిస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఇది సూపర్ సైక్లోన్‌గా మారినట్లు వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశగా 154 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉందని, తుఫాను కేంద్రకం 24 కిలోమీటర్ల మేర విస్తరించినట్లు వెల్లడించింది.

రేపు గోపాల్‌పూర్-చాంద్‌బలీ మధ్య ఫణి తీరం దాటనుంది. ఇది తీరానికి దగ్గరగా వచ్చే సమయంలో గంటకు 195 కిలోమీటర్ల వేగంతో.. తీరం దాటే సమయంలో గంటకు 130-140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై రాత్రి నుంచి అధికంగా ఉండే అవకాశం ఉంది.

మరోవైపు ఫణి తుఫాను నేపథ్యంలో ఒడిశా, ఏపీ తీరప్రాంతాల్లోని సుమారు 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలకు ఆహారం, తాగునీటి సదుపాయాన్ని కల్పించారు. ఇచ్చాపురం, పలాస, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాలకు ఒక్కో ఐఏఎస్ అధికారిని నియమించి సహాయక చర్యలు పర్యవేక్షిస్తోంది ప్రభుత్వం.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి.. పాతిక వేలమందిని తరలించారు. లక్షమందికి భోజన వసతిని ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల వద్ద గ్రామాధికారులతోపాటు పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య కార్యకర్తలను నియమించారు.

తుఫాను నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. భువనేశ్వర్ వైపు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేస్తున్నట్లు గో ఎయిర్ తెలిపింది. మరోవైపు 89 రైళ్ల రాకపోకలను పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మూడు రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఒడిషాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొత్తూరు, భామిని, హిర మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

వజ్రపుకొత్తూరు, పలాస, మందస మండలాల్లో పెనుగాలుల తీవ్రత పెరిగింది. భారీ వర్షం కారణంగా     ఉత్తరాంధ్రలో మామిడి, అరటి, జీడీ పంటలకు అపార నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. 
 

click me!