అమ్మ ఒడిలో రూ. 743 కోట్ల స్కాం.. ఎన్నికల తర్వాత ఈ స్కాంపైనే దర్యాప్తు: జనసేన తీవ్ర ఆరోపణలు

By Mahesh K  |  First Published Oct 20, 2023, 6:56 PM IST

అమ్మ ఒడి పథకంలో రూ. 743 కోట్ల స్కాం జరిగిందని జనసేన తీవ్ర ఆరోపణలు చేసింది. ఏపీ విద్యా శాఖలో అవకతవకలు జరుగుతున్నాయని తెలిపింది. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం పోయాక ఈ స్కాంపైనే మొదటగా దర్యాప్తు జరుగుతుందని హెచ్చరించింది.
 


అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ రోజు మంగళగిరిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా విద్యా శాఖలో అవకతవకలు జరుగుతున్నాయని, అమ్మ ఒడి పథకంలో పెద్ద స్కాం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. అమ్మ ఒడి పథకంలో రూ. 743 కోట్ల స్కాం జరిగిందని నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేయగా.. 2024 ఎన్నికల తర్వాత తాము ఈ స్కాంపైనే మొదటగా దర్యాప్తు జరిపిస్తామని పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు.

జగన్ ప్రభుత్వం విద్యా శాఖలో తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటున్నదని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. అమెరికాలోని యూనివర్సిటీలోకి వెళ్లే వారికి టోఫెల్ అవసరం ఉంటుందని, కానీ, స్కూల్‌లో చదువుకునే రెండో తరగతి, మూడో తరగతి పిల్లలకు ఈ శిక్షణ ఎందుకు అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు శిక్షణ కోసం విదేశీ సంస్థలకు ఎందుకు పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నారని అడిగారు. ఆ ఒప్పందాల్లోని క్లాజులనూ ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. కేవలం ఆ సంస్థలే ఎందుకు శిక్షణ ఇవ్వాలి? ఆర్బిట్రేషన్ స్విట్జర్లాండ్‌లో ఎందుకు అని ప్రశ్నించారు. అదే విధంగా ఆయన విద్యా కానుక, అమ్మ ఒడి పథకాల గురించి మాట్లాడారు.

Latest Videos

ప్రభుత్వం జరిపిన సర్వేల వివరాలను ఆధారంగా చేసుకునే తాను మాట్లాడుతున్నానని పేర్కొంటూ సెప్టెంబర్ 2022 నుంచి ఆగస్టు 2023 మధ్యలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 4.48 లక్షల విద్యార్థులు వెళ్లిపోయారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. జగన్ ప్రభుత్వం 42.61 లక్షల విద్యార్థులకు అమ్మ ఒడి ఇచ్చారని వివరించారు. అదే విద్యా కానుక మాత్రం 39.95 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చారని, ఈ సంఖ్య ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. 

అదే 2023 జులైలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 37.57 లక్షల మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలలో ఉన్నారని తేలిందని, అలాంటప్పుడు 42.61 లక్షల మంది విద్యార్థులకు అమ్మ ఒడి ఎలా ఇచ్చారని నాదెండ్ల ప్రశ్నించారు. విద్యార్థుల్లో తేడా 5.71 లక్షలుగా కనిపిస్తున్నదని, ఒక్కొక్కరికి రూ. 13 వేల చొప్పున లెక్కేసినా సుమారు రూ. 743. 18 కోట్లు ఎవరి చేతుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. అమ్మ ఒడిలో పెద్ద స్కాం ఉన్నదని ఆరోపించారు.

Also Read: బండికి బీజేపీ అధిష్టానం బ్రేక్? ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదా?

అనంతరం, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇంగ్లీష్ భాష వస్తేనే ప్రయోజకులు అవుతారా? అలా అంటే అమెరికా, ఇంగ్లాండ్‌లలో పేదరికం అనేది ఉండకూడదు కదా? అని అన్నారు. కేవలం భాష స్లాంగ్‌ కోసం ఎందుకు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టడం? యూట్యూబ్‌లో ఉచితంగా వీడియోలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులకు డిజిటల్ పీరియడ్‌గా కొంత సమయం కేటాయిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం పోయాక ఈ స్కాం పైనే తొలిసారిగా దర్యాప్తు జరుపుతామని అన్నారు. తమ ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

click me!