ఇక ఈ ఎన్నికలు ఎందుకు?: జగన్ సర్కార్ పై సిపిఐ రామకృష్ణ ఆగ్రహం

Arun Kumar P   | Asianet News
Published : Jan 28, 2021, 03:53 PM ISTUpdated : Jan 28, 2021, 03:58 PM IST
ఇక ఈ ఎన్నికలు ఎందుకు?: జగన్ సర్కార్ పై సిపిఐ రామకృష్ణ ఆగ్రహం

సారాంశం

సుప్రీంకోర్టు తీర్పు తర్వాతయినా సరే రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు వచ్చి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరిస్తారని అందరూ భావించారని...కానీ అలా జరగడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో కూడిన వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీకి ప్రభుత్వం సిద్ధం కావటం ఎన్నికల కోడ్ కు విరుద్ధమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. వచ్చే నెల(పిబ్రవరి) రేషన్ డోర్ డెలివరీ ఎన్నికలయ్యేంత వరకు వాయిదా వేయాలని ఎన్నికల కమిషనర్ కు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
 
''సుప్రీంకోర్టు తీర్పు తర్వాతయినా సరే రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు వచ్చి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరిస్తారని అందరూ భావించారు. కానీ బాధ్యత స్థానంలో ఉన్న రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఎన్నికల కమిషన్ ను కించపరిచేలా మాట్లాడుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వాయిస్ గా పేరుగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఎస్ఈసిని కించపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు'' అంటూ వైసిపి నాయకులు తీరును తప్పుబట్టారు.

''కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏకగ్రీవాలపై ప్రకటనలు ఎందుకు ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదు. ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా 125 జెడ్పీటీసీ, 2 వేలకు పైగా ఎంపీటీసీలను వైసిపి ఏకగ్రీవం చేసుకుంది. పోలీసులను ప్రయోగించి, ప్రలోభాలు, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి వైసిపి ఈ ఏకగ్రీవాలు చేసుకుంది. ఇలా దౌర్జన్యంగా ఏకగ్రీవాలు చేసుకునే పక్షంలో అసలు ఎన్నికలు ఎందుకు?'' అని రామకృష్ణ ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్