
శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలాసలో ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు. సంతబొమ్మాళి మండలం నంది విగ్రహం ఏర్పాటు వివాదంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కాశీబుగ్గ డీఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
దీంతో ఆయనకు మద్ధతుగా టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
కొద్దిరోజుల క్రితం సంతబొమ్మాళి పాలేశ్వరస్వామి ఆలయంలో చెట్టు కింద ఖాళీగా ఉన్న నంది విగ్రహాన్ని ఆలయ కమిటీ సభ్యులు తీసుకొచ్చి బయట ఉన్న ఒక దిమ్మెపై ప్రతిష్ఠించారు.
ఈ వ్యవహారంపై స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుతో 16 మందిపై సంతబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇందులో కొందరు పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నండటంతో అచ్చెన్నాయుడిను మర్యాదపూర్వకంగా కలిశారట. ఫిర్యాదులో పేర్లున్న కొందరు ఆయన్ను కలిసిన తర్వాతే ఈ ఘటన జరిగిందని.. అందుకే ఆయన్ను కూడా ప్రశ్నించేందుకు నోటీసులిచ్చినట్లు సమాచారం.