ఏపీలో ఉన్నదేగా చెప్పింది.. హరీశ్‌రావు మాటల్లో తప్పేంలేదు : సీపీఐ రామకృష్ణ

By Siva KodatiFirst Published Oct 1, 2022, 7:06 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్ధితులపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ. హరీశ్ రావు వున్నది వున్నట్లు చెబితే వైసీపీ నేతలకు ఉలికిపాటేందుకని రామకృష్ణ ప్రశ్నించారు. 

ఏపీపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హరీశ్ రావు వున్నది వున్నట్లు చెబితే వైసీపీ నేతలకు ఉలికిపాటేందుకని రామకృష్ణ ప్రశ్నించారు. ఉద్యోగులు, టీచర్లు పట్ల జగన్ ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నామన్నారు. పీఆర్సీ, సీపీఎస్ అంశాల్లో ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లలేదా అని రామకృష్ణ ప్రశ్నించారు. ఉద్యోగులు, టీచర్లను పీఎస్‌లకు పిలిచి వేధించలేదా అని ఆయన నిలదీశారు. ఆఖరికి టీచర్లను మద్యం షాపుల ముందు నిలబెట్టారా లేదా అని రామకృష్ణ ప్రశ్నించారు. 

అంతకుముందు మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తుందన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో టీచర్లకు 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని మంత్రి అన్నారు. అయితే రాష్ట్రంలో వేతనాలు కాస్త ఆలస్యం అవుతున్న మాట వాస్తవమేనని హరీశ్ రావు అంగీకరించారు. అంతేకాకుండా ఏపీ సీఎం వైఎస్ జగన్‌లా కేంద్రం పెట్టిన షరతులకు అంగీకరించి వుంటే ఏటా రూ.6 వేల కోట్ల అప్పులు తీసుకుని రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేవారమని హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Also REad:వైఎస్ కుటుంబం విచ్ఛిన్నం.. ఇప్పుడు కేసీఆర్‌పై కన్ను, సజ్జల బుద్ధే అంత : గంగుల కమలాకర్ వ్యాఖ్యలు

ఇకపోతే... ఏపీలో కరెంట్ కోతలపైనా హరీశ్ రావు మొన్నామధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తిరుపతి వెళ్లినప్పుడు కొందరినీ కలిశానని చెప్పారు. వాళ్లది గుత్తి, అనంతపురం అని చెప్పారని... మీ దగ్గర కరెంట్ ఎంత సేపు వుంటుందని అడిగానని హరీశ్ రావు తెలిపారు. ఉదయం 3 గంటలు, రాత్రి 4 గంటలు కరెంట్ వుంటుందని తనకు చెప్పారని మంత్రి చెప్పారు. మళ్లీ గంట గంటకి కరెంట్ పోతుందని తెలిపారని హరీశ్ రావు వెల్లడించారు. 
 

click me!