మీ నిర్ణయం హర్షణీయమే...కానీ..: జగన్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ

By Arun Kumar PFirst Published Nov 19, 2020, 12:00 PM IST
Highlights

గతంలో డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ళను కేటాయించాలని సిపిఐ కార్యదర్శి  రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్ కు సూచించారు. 

అమరావతి: డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే 1 సెంటు స్థలం ఒక కుటుంబం నివసించేందుకు ఏమాత్రం సరిపోదు కాబట్టి  ఇళ్ల స్థలాలను పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్ కు సూచించారు. 

''డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ళను కేటాయించండి. గత ఎన్నికల సందర్భంగా టిడ్కో ఇళ్ళను ఉచితంగా లబ్ధిదారులకు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీ మేరకు టిడ్కో ఇళ్ల రుణ బకాయిలను ప్రభుత్వమే చెల్లించి, లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలి. సంక్రాంతిలోగా టిడ్ కో ఇళ్లకు మరమ్మతులు చేపట్టి, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించండి'' అని రామకృష్ణ సూచించారు. 

డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని ప్రకటించి వేయి కళ్లతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. కోర్టు స్టే వున్న ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని సర్కార్ తెలిపింది.

డీ-ఫామ్ పట్టా ఇచ్చి ఇంటి స్థలం కేటాయించనుంది ప్రభుత్వం. అదే రోజు ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టి... తొలి దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. ఇళ్ల పట్టాల పంపిణీ విషయమై సీఎం జగన్ బుధవారం మీడియాతో మాట్లాడి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. 

click me!