వైఎస్ జగన్ బకరాలా దొరికాడు : ఆర్కే సంచలన వ్యాఖ్యలు

By Nagaraju TFirst Published 20, Jan 2019, 8:31 PM IST
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ డైరెక్షన్లో జగన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. 

ఒంగోలు: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ డైరెక్షన్లో జగన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. 

ఒంగోలులో సీపీఐ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీ డైరెక్షన్లో నడుస్తుంటే జగన్ కేసీఆర్ డైరెక్షన్లో నడుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఒక బకరాలా దొరికారని వ్యాఖ్యానించారు. 

ప్రధాని మోదీ కోసమే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేశారన్నారు. మోదీకి ఉపయోగపడేలా ఉన్న ఫెడరల్‌ ఫ్రంట్‌ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. 

దేశంలో ఫెడరల్‌ ఫ్రంట్‌తో కలిసేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. రాష్ట్రాల్లోని వివిధ పార్టీలు ఎలా ఉన్నా దేశ భవిష్యత్‌ కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రత్యేక హోదాపై టీఆర్‌ఎస్‌ నేతలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. 

రాజధాని భూములపై బాండ్ల రూపంలో రూ.2వేల కోట్లు అప్పు తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు రాజధాని భూములను తాకట్టు పెట్టి రూ.10వేల కోట్లు అప్పు తెచ్చేందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు. 

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించకపోతే రాష్ట్రం ప్రమాదంలో పడుతుందన్నారు. ఈ నెల 25న విశాఖపట్నంలో జనసేన, సీపీఐ, సీపీఎం ఉమ్మడి సమావేశం జరుగుతుందని తెలిపారు. ఆ సమయంలో ఉమ్మడి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు. 
 

Last Updated 20, Jan 2019, 8:31 PM IST