Cotton price: సిరులు కురిపిస్తున్న తెల్ల బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో పత్తికి రికార్డు ధర..

Published : Dec 31, 2021, 12:29 PM IST
Cotton price: సిరులు కురిపిస్తున్న తెల్ల బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో పత్తికి రికార్డు ధర..

సారాంశం

తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి పండించిన రైతులకు ఈ సారి కాసుల పంట పండుతుంది. మార్కెట్‌లో పత్తి ధరలు (Cotton prices) భారీగా పెరిగాయి. క్వింటాలు పత్తి ధర రూ. 9 వేలు దాటింది. రికార్డు స్థాయిలో ధర పలకడంతో పత్తి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి పండించిన రైతులకు ఈ సారి కాసుల పంట పండుతుంది. మార్కెట్‌లో పత్తి ధరలు (Cotton prices) భారీగా పెరిగాయి. క్వింటాలు పత్తి ధర రూ. 9 వేలు దాటింది. రికార్డు స్థాయిలో ధర పలకడంతో పత్తి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి ధరలు ఈసారి భాగానే ఉన్నాయి. సీఐఐ ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువ డబ్బులు చెల్లించి ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. 

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో (Adoni Agriculture Market) పత్తి ధరలు ఓ రేంజ్‌లో పెరిగాయి. గురువారం అక్కడ పత్తి ధర రూ. 9,600 పలికింది. అయితే పత్తి ధర ఈ స్థాయిలో పలకడం ఇదే తొలిసారి. ఈ నెల మొదట్లో ధరలు భారీగా లేకున్న.. రెండో వారం తర్వాత నుంచి ధరల్లో పెరుగుదల మొదలైంది. దేశీయంగా పత్తి కొరత నెలకొనడంతో ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి భారీ వర్షాలు, ఇతర కారణాల వల్ల దిగుబడి తగ్గినప్పటికీ.. ధరలు బాగా ఉండటంతో నష్టం చేకూరే అవకాశాలు తక్కువగా ఉన్నట్టుగా రైతులు తెలిపారు. 

తెలంగాణలోని ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్ పత్తి రూ. 9 వేలు పలికిందని అధికారులు తెలిపారు. ఇక, గురువారం ఖమ్మం మార్కెట్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో పత్తి ధర అత్యధికంగా క్వింటాల్‌కు రూ.9,100 ధర పలికింది. మరోవైపు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో (Enumamula agricultural market) పత్తి ధర గురువారం క్వింటాల్‌కు రూ. 8,805 పలికింది. గతేడాది పోలిస్తే ఈసారి ధరలు ఎక్కువగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. 

కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ (Jammikunta agricultural market) విషయానికి వస్తే.. ఇక్కడ పత్తి ధర గరిష్టంగా రూ. 8,850 పలికింది. అయితే కరీంనగర్‌లో మాత్రం రూ. 8,693 మాత్రమే ధర పలికింది. పెద్దపల్లి జిల్లాలో గత వారం రోజులుగా క్వింటాల్ పత్తి ధర రూ. 8,500కు పైగానే ఉంది.

పత్తి ధరలపై అధికారులు మాట్లాడుతూ.. గత మూడేళ్లలో పత్తికి లభించిన అత్యధిక ధర ఇదేనని అన్నారు. నాలుగు నెలల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గిందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఉత్పత్తులకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటం కూడా ధరల పెరుగుదలకు కారణమైందని చెప్పారు. ఇక, సీజన్ ప్రారంభంలో పత్తి క్వింటాల్‌కు రూ. 6వేలు పలికింది. అయితే గత రెండు నెలలుగా ధరలు పెరుగుతూ వచ్చాయి. 
 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!