కర్నూల్ లో కరోనా విజృంభణ... ఆ వైసిపి ఎమ్మెల్యే కారణంగానే...: అఖిలప్రియ సంచలనం

By Arun Kumar PFirst Published Apr 22, 2020, 1:24 PM IST
Highlights

కరోనా వ్యాప్తికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కారణమంటూ మాజీ మంత్రి,టిడిపి మహిళా నాయకురాలు భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 కర్నూల్: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి... ఈ నేపథ్యంలో తమ పరిస్థితి ఏంటా అని రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారని మాజీ మంత్రి
 భూమా అఖిలప్రియ అన్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఎంతసేపూ ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంపైనే దృష్టి పెడుతున్నారని...  ప్రజల భయాందోళనలకు తొలగించి భరోసానిచ్చే ప్రయత్నం చేయడంలేదని మండిపడ్డారు. వైసీపీ నేతల్లాగా నోటి కొచ్చినట్టు మాట్లాడ్డం తమకు చేతకాదని... అందువల్లే వారిలా వ్యక్తిగత ఆరోపణలు  చేయడం లేదన్నారు. ప్రజల ప్రాణాలతో వైసిపి ప్రభుత్వం ఆడుకుంటున్నా ప్రశ్నించకూడదంటే ఎలా? అని అఖిలప్రియ మండిపడ్డారు.    

''ఏపీలో కరోనా కేసులు పెరగడానికి వైసీపీ నేతలే కారణం. కరోనాను ముఖ్యమంత్రి తేలిగ్గా తీసిపారేశారు. అధికారులు కూడా ఎటువంటి జాగ్రత్తలు చెప్పకపోవడంతో ప్రజలకు వ్యాధి తీవ్రత పెద్దగా తెలియలేదు. స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన తర్వాతే అసలు విషయం బయట పడింది. ఇప్పటకీ వైసీపీ కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలేదు'' అని ఆరోపించారు.     

''ఎన్నికలు వస్తాయి వస్తాయి అని చెప్పి వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్టు బయట తిరిగారు. వారి చుట్టూ అధికారులు తిరగడం వల్ల ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేకపోయారు. అధికారులు డ్యూటీ చేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. స్థానిక ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో కరోనా కేసులను బయటకు రానీయకుండా ఈ ప్రభుత్వం ఆపేసింది. చనిపోయిన వారి వివరాలు తెలియనివ్వలేదు. ఎవరికి టెస్ట్ లు చేస్తున్నాం, ఎన్ని కిట్లు అందుబాటులో ఉన్నాయనే వివరాలు బయటకు రానివ్వకుండా అధికారులను ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకుని ప్రజలను మోసం చేస్తోంది'' అన్నారు.     

''కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే కరోనా కట్టడికి ఏం చేస్తున్నారో తెలియడం లేదు. కర్నూలు జిల్లాలో కరోనా పెరగడానికి కారణం హఫీజ్ ఖాన్ అని అందరికీ తెలుసు. జిల్లాలో కేసులు పెరగడానికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి'' అంటూ అఖిలప్రియ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

''ప్రజల ప్రాణాల కోసం వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇవేమీ పట్టని ఈ ప్రభుత్వం కళ్లు మూసుకుని రాజకీయం చేస్తోంది. అనంతపురంలో ఏఎస్ఐ చనిపోయాడు. ఎమ్మార్వో కు కరోనా వచ్చింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ట్రాక్టర్లతో ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే తీరును చూసి దేశమంతా మనల్ని చూసి నవ్వుతోంది. వైసీపీ ఎమ్మెల్యే నిర్వాకం వల్ల 8 మంది ప్రభుత్వ అధికారులకు కరోనా వచ్చింది. వారి కుటుంబాలకు కాళహస్తి ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్తాడు?  ఆ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు?'' అని  ప్రశ్నించారు.     

''ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. వైసీపీ అధికారంలోకి వస్తే రైతు రాజు అవుతాడు, బంగారం పండిస్తాడని చెప్పి మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక రైతులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోవడం లేదు. పులివెందులలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరులో రఘనాథ్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు'' అని  అఖిలప్రియ గుర్తుచేశారు. 

click me!