మరో ధారావిగా జక్కంపూడి వైఎస్సార్ కాలనీ... భారీగా బయటపడుతున్న పాజిటివ్ కేసులు

By Arun Kumar PFirst Published Jun 10, 2020, 10:32 AM IST
Highlights

కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా ప్రభావం అధికంగా వున్న 42 డివిజన్లలో పూర్తి లాక్ డౌన్ విధించారు. ఈ ప్రాంతాల్లో ఏవిధమైన వ్యాపారాలకు అనుమతులు ఇవ్వబోమని అధికారులు వెల్లడించారు. 

మరీముఖ్యంగా నగర శివారు ప్రాంతమైన జక్కంపూడి వైయస్సార్ కాలనీలో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయినప్పటికి ఈ ప్రాంతంపై అధికారులు, పోలీసులు దృష్టి సారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

ఇటీవల ఈ ప్రాంతంలోని శ్రీనివాస్ జనరల్ స్టోర్స్ యజమాని అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అతడికి కరోనా లక్షణాలుండటంతో వైద్యులు టెస్ట్ లు చేశారు. అతడికి పాజిటివ్ వస్తే ఈ ప్రాంతంలో మరిన్ని కేసుల నమోదయ్యే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ప్రాంతాన్ని అశ్రద్ధ చేస్తే మరో ముంబై ధారవి గా మారే ప్రమాదం ఉందని... కాబట్టి  ఈ కాలనీపై ఇకనైనా అధికారులు దృష్టి పెట్టి మరింత జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 

read more  యాక్టివ్ కేసులను దాటిన రికవరీ రోగులు: కరోనా కేసుల్లో ఐదో స్థానానికి చేరిన ఇండియా

మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల తాకిడి ఏ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం రికార్డు స్థాయిలో 216 మందికి పాజిటివ్‌గా తేలడంతో  మొత్తం కేసుల సంఖ్య 5,029కి చేరింది. పాజిటివ్‌గా తేలిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారు 147, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 69 మంది ఉన్నారు.

కాగా రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 77కి చేరింది. ఏపీలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,510 కాగా, ఇప్పటి వరకు 2,403 మంది డిశ్చార్జ్  అయ్యారు.

మరోవైపు సచివాలయంలో  పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు కోవిడ్ 19 సోకడం ప్రభుత్వ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది. మరోవైపు ఈ పరిణామాలు ఈ నెల 11న జరగనున్న రాష్ట్ర మంత్రి మండలి సమావేశంపై ప్రభావం చూపే పరిస్ధితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ ఎలా నిర్వహించాలనే దానిపై సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు 10 మంది సెక్రటేరియేట్ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఛాంబర్ ఉండే ఫస్ట్ బ్లాక్‌లో జీఏడీ ఉద్యోగికి, ఆర్‌టీజీఎస్ ఉద్యోగికి కరోనా సోకింది. సచివాలయంలో పనిచేసే వ్యవసాయ, సహకార శాఖల ఉద్యోగులకు ఇప్పటికే  వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించారు పూనం మాలకొండయ్య.

అలాగే పరిశ్రమల శాఖ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు. కాగా సచివాలయ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాలని సీఎస్ నీలం సాహ్నికి ఉద్యోగుల సంఘాలు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. కరోనా కారణంగా సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కుదరని పక్షంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


 

click me!