నిందితులతో చేతులు కలిపిన ఖాకీలు: ముగ్గురిపై సస్పెన్షన్ వేటు

By Nagaraju penumalaFirst Published Sep 26, 2019, 10:44 AM IST
Highlights


పోలీస్‌ శాఖలో అవినీతి పరులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. ఏ చిన్న ఆరోపణలు వచ్చినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. 

మచిలీపట్నం: ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులతో చేతులు కలిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గుురు పోలీసు అధికారులపై కృష్ణా జిల్లా ఎస్పీ ఝులిపించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించారని ఆరోపిస్తూ సస్పెన్షన్ వేటు వేశారు. 

వివరాల్లోకి వెళ్తే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు ఎస్‌ఐలు, ఓ కానిస్టేబుల్‌పై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ నెల 14న జరిగిన మెగా లోక్‌ అదాలత్‌లో ఓ కేసులో రాజీ చేసేందుకు బాధితుడిని భయబ్రాంతులకు గురిచేసి డబ్బులు డిమాండ్ చేసిన పెనుగంచిప్రోలు ఎస్‌ఐ ఎండీ అష్ఫాక్‌ పై సస్పెన్షన్ వేటు వేశారు. 

కేసు రాజీ చేసేందుకు భారీగా డబ్బులు డిమాండ్‌ చేసినట్టు ఆరోపణలు రావడంతో ఎస్పీ సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణలో డబ్బులు డిమాండ్ చేసిన విషయం వాస్తవమని తేలడంతో ఎస్‌ఐపై చర్యలకు సిఫార్సు చేస్తూ డీఐజీకి నివేదిక సమర్పించారు ఎస్పీ. 

మరోవైపు కైకలూరు టౌన్‌ పరిధిలోని అయోధ్యపురంలో పేకాట శిబిరంపై జరిపిన దాడిలో నిందితులకు ఫేవర్ గా ఎస్సై, రూరల్ కానిస్టేబుల్ ప్రవర్తించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పేకాట శిబిరంపై దాడి సందర్భంగా పోలీసులు 2.10 లక్షల నగదు, ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 

ఈకేసు నుంచి కొంతమంది నిందితులను తప్పించేందుకు కలిదిండి ఎస్‌ఐ వై.సుధాకర్, రూరల్‌ కానిస్టేబుల్‌ రజనికుమార్‌ ప్రయత్నించినట్లు సమగ్ర విచారణలో తేలింది. ఈ అంశంపై కూడా డీఐజీకి నివేదిక సమర్పించారు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. డీఐజీ ఆదేశాల మేరుకు ఎస్సై సుధాకర్ తోపాటు కానిస్టేబుల్ రజనికుమార్ పై సస్పెన్షన్ వేటు వేశారు.  

పోలీస్‌ శాఖలో అవినీతి పరులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. ఏ చిన్న ఆరోపణలు వచ్చినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. 

గతంలో నాగాయలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాకు సహకరించిన కోడూరు ఎస్‌ఐ ప్రియకుమార్‌ను, అవనిగడ్డ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పేకాట శిబిరం నిర్వహిస్తున్న వారికి సహకరించిన కానిస్టేబుల్‌ రమేష్‌ను సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసిందే.  

పోలీస్‌ శాఖలో విధి నిర్వహణలో అలసత్వాన్ని గానీ, క్రమశిక్షణా రాహిత్యాన్ని గానీ ఊపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. పోలీస్‌ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ప్రత్యేక బృందాలతో ప్రతి ఒక్కరి పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు తెలిపారు. వినీతి రహిత పోలీసింగ్‌ కోసం కృషి చేస్తున్నామని అందుకు అంతా సహకరించాలని కోరారు.

click me!