
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో హృదయవిదారక ఘటన జరిగింది. బైక్ పై వెళ్లుతుండగా కానిస్టేబుల్ కిరణ్ కుమార్ దంపతులు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డుపై పడిపోగానే మరో వాహనం వారి మీది నుంచి వెళ్లిపోయింది. దీంతో కదల్లేని పరిస్థితుల్లో కిరణ్ కుమార్ స్థానికులను సహాయం చేయాలని ప్రాధేయపడటం, చుట్టూ మూగిన జనాలు చేష్టలుడిగి చూశారేగానీ, సహాయం చేయకపోవడం మరింత కలచి వేసింది. ఈ ప్రమాదంలో కిరణ్ కుమార్ మరణించగా.. ఆయన భార్య హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడుతున్నది. ఈ ప్రమాదం అనంతపురం నగరం సమీపంలో చోటుచేసుకుంది.
ఒంటినిండా గాయాలతో హాస్పిటల్‌లో జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్‌తో కిరణ్ కుమార్ అన్న మాటలు మరింత బాధాకరంగా ఉన్నాయి. అన్నా.. తమను రక్షించాలని, ఇదొక్కసారికి తన ప్రాణాలు కాపాడాలని కిరణ్ కుమార్ ప్రాథేయపడ్డారు. తమకు పిల్లలున్నారని, తన ప్రాణాలు నిలవాలని అన్నారు. త్రిలోక్‌నాథ్‌తో కిరణ్ కుమార్ చెప్పిన చివరి మాటలు అవి.
కిరణ్ కుమార్ జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య అనిత శింగనమల మండలం తరిమెల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లల సంతానం ఉన్నది. నగరంలో ఎస్బీఐ కాలనీలో సొంతిళ్లు కట్టుకుని అందులో ఉంటున్నారు.
భార్య అనితను సోమలదొడ్డి క్రాస్ వద్దకు రోజు తీసుకువచ్చి బస్సు ఎక్కించేవారు. ఎప్పట్లాగే బుధవారం కూడా ఉదయం 7.30 గంటలకు భార్యను బైక్ పై కూర్చోబెట్టుకుని కిరణ్ కుమార్ బయల్దేరాడు. నగర శివారులోని గోపాల్ దాబా వద్ద 44వ నేషనల్ హైవేపై బైక్ ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. అదే సమయంతో ఓ వాహనం వేగంగా వారి మీది నుంచి వెళ్లిపోయింది. కానిస్టేబుల్ కిరణ్ కుమార్ రెండు కాళ్లూ దారుణంగా గాయపడ్డాయి. భార్య తల, ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లింది. పోలీసులు వారిని అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలిస్తుండగా కిరణ్ కుమార్ మరణించగా.. అనిత హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతున్నది. ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నది.
Also Read: దొంగ ప్రేమికుడు: బార్ గర్ల్‌ఫ్రెండ్ కోసం 41 దొంగతనాలు, 50 లక్షలు ఖర్చు పెట్టిన దొంగ
రోడ్డుపై కదల్లేని స్థితిలో రక్తపు మడుగులో ఉన్న ఆ దంపతుల వద్దకు స్థానికులు ఎవరూ వెళ్లలేదు. జనం గుమిగూడి ఫొటోలు, వీడియోలు తీసుకుంది కానీ, వారిని కాపాడటానికి ముందుకు వెళ్లలేదు. ఆ ఇద్దరు దంపతులే ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. అక్కడున్న వారు కేవలం 108కు ఫోన్ చేసి అలా చూస్తూ ఉండిపోయారని తెలిసింది.