ఏపీలో రాహుల్‌ వ్యూహలకు పదును: ఆ ముగ్గురికి కాంగ్రెస్ గాలం

First Published Jun 21, 2018, 5:06 PM IST
Highlights

ఏపీలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ కసరత్తు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది.  2014కు ముందు పార్టీ నుండి వెళ్ళిసోయిన నేతలను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు చర్యలు తీసుకొంటుంది. ఈ మేరకు ఆయా నేతలతో చర్చించాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇంఛార్జీ ఉమెన్ చాందీ పార్టీ రాష్ట్రనాయకులను ఆదేశించారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయానికి వచ్చింది.  కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇంఛార్జీగా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి నాయకత్వాన్ని అప్పగించారు.  పార్టీ రాష్ట్ర ఇంఛార్జీగా బాధ్యతలు స్వీకరించిన ఉమెన్ చాందీ ఇటీవల ఏపీకి వచ్చారు. పార్టీ నాయకులతో చర్చించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోయిన నేతలను  తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జీ  ఉమెన్ చాందీ పార్టీ రాష్ట్ర నాయకులను ఆదేశించారు.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు హర్షకుమార్, ఉండవల్లి అరుణ్‌కుమార్ లతో  చర్చించాలని  ఉమెన్ చాందీ పార్టీ నేతలను కోరారు.  మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి  ఆహ్వానించే బాధ్యతను మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజుకు అప్పగించారు. 

పళ్లంరాజు త్వరలోనే మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో  చర్చించే అవకాశాలు లేకపోలేదు.  అయితే పార్టీని వీడిన వారిలో  ఇప్పటికే కీలకమైన నేతలు టిడిపి, బిజెపి, వైసీపీల్లో చేరారు.  ఆయా పార్టీల్లో స్థానం లేని వారంతా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. లేదా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఏపీలో పుంజుకొనే పరిస్థితులు కన్పించడం లేదనే  అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొనే అవకాశం కూడ లేకపోలేదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.  ఈ తరుణంలో పార్టీకి చెందిన మాజీ కీలక నేతలను మరోసారి పార్టీలోకి తీసుకురావడం ద్వారా ఎన్నికల నాటికి పార్టీ క్యాడర్‌లో ఆత్మస్థైర్యాన్ని నింపే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

click me!