ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా తిరుపతి...: మాజీ కేంద్ర మంత్రి కొత్త వాదన

By Arun Kumar PFirst Published Feb 15, 2024, 1:51 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని వివాదం ఇప్పట్లో తేలేలా కనిపంచడంలేదు. ఇప్పటికే అమరావతి, విశాఖపట్నం, కర్నూల్ ఏపీ రాజధానుల లిస్ట్ లో వుండగా తాజాగా మరోపేరు తెరపైకి వచ్చింది. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వేళ రాజధాని వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టిడిపి అమరావతి అంది...  ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి మూడు రాజధానులంది... ఇప్పుడు మళ్లీ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను తెరపైకి తెచ్చారు.  ఇలా అసలు ఏపీ రాజధాని ఏదో తెలియక ఏపీ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతుంటే కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తిరుపతిని రాజధాని చేయాలంటూ కొత్తవాదన తెరపైకి తెచ్చారు. 

రాయలసీమలో అభివృద్ది జరగాలంటే తిరుపతి రాజధాని కావాలి... ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని చింతా మోహన్ అన్నారు. భవిష్యత్ గురించి ముందే చెప్పిన కాలజ్ఞాని బ్రహ్మంగారు కూడా తిరుపతి రాజధాని అవుతుందని చెప్పారన్నారు. రాయలసీమలో కరువులు పోవాలంటే... ఇక్కడి ప్రజల కష్టాలు, బాధలు తీరాలంటే తిరుపతిని రాజధాని చేయడమే మార్గమని అన్నారు. రాజధాని ఏర్పాటుకు అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతం తిరుపతి అని చింతా మోహన్ పేర్కొన్నారు. 

హైదరాబాద్ కంటే అద్భుతమైన వాతావరణం తిరుపతిలో వుంటుందని... భూములు, వనరులకు కొదవలేదని అన్నారు. ఏడు జాతీయ రహదారులు, 7 విశ్వవిద్యాలయాలు తిరుపతిలో ఉన్నాయి. ఇలా అమరావతి, మూడు రాజధానులు, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింపు డిమాండ్ ను పక్కనబెట్టి తిరుపతిని రాజధానిగా ప్రకటించాలని చింతా మోహన్ కోరారు. 

రాయలసీమకు చెందిన చాలామంది నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేసారు... కానీ ఎవరూ తిరుపతిని రాజధాని చేయాలని ప్రయత్నించలేదన్నారు. చివరకు తిరుపతిలోనే చదువుకున్న చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేసారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ఆయన రాజధానికి అక్కడ ఏర్పాటుచేసారని మాజీ కేంద్ర మంత్రి ఆరోపించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ తన స్వార్థంకోసం మూడు రాజధానులు అన్నారన్నారు. అందరు కలసి ఆంధ్రప్రదేశ్ రాజధానిని గాల్లో ఉంచారని చింతా మోహన్ ఎద్దేవా చేసారు. 

Also Read  జగనన్నా... ఇన్నాళ్లు గుడ్డిగుర్రాల పళ్లు తోమారా? : వైఎస్ షర్మిల

తిరుపతిని రాజధాని చేయాలని మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సూచించారు...కానీ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కర్నూల్ కు తరలించారని చింతా మోహన్ తెలిపారు. ఆ తర్వాత బాషా ప్రాతిపదికన ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలను ఒకే రాష్ట్రంగా చేసారు... రాజధానికి హైదరాబాద్ కు తరలించారని తెలిపారు. ఇలా ఏనాడో రాజధాని కావాల్సిన తిరుపతి ఇప్పటికీ ఆ అవకాశం కోసం ఎదురుచూస్తోందన్నారు. 

ప్రస్తుతం వైసిపి పాలనలో రాష్ట్ర పరిస్థితి పాకిస్థాన్ కంటే హీనంగా తయారయ్యిందని... రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని చింతా మోహన్ ఆందోళన వ్యక్తం చేసారు. రాబోయే ఎన్నికల్లో వైసిపికి పట్టుమని పదిసీట్లు కూడా రావని... టిడిపి పరిస్థితి కూడా అలాగే వుంటుందన్నారు. వైఎస్ షర్మిల రాకతో రాష్ట్ర కాంగ్రెస్ లో జోష్ వచ్చిందని... ఇది పార్టీకి ఎంతో లాభం చేస్తుందన్నారు. కాంగ్రెస్ కావాలని అందరూ కోరుకొంటున్నారు... కాబట్టి 130 మందికిపైగా ఎమ్మెల్యేలను గెలిపించుకుని అధికారంలోకి వస్తామంటూధీమా వ్యక్తం చేసారు. తమిళనాడులో జయలలిత మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో షర్మిల తొలి మహిళా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకొంటున్నట్లు చింతా మోహన్ తెలిపారు. 

ఇక ఇప్పటికీ చిరంజీవి కాంగ్రెస్ సభ్యత్వాన్ని కలిగివున్నారు... కాబట్టి ఆయన కాంగ్రెస్ నుండి పోటీ చేయాలని చింతా మోహన్ కోరారు. కాపులు అధికారంలోకి రావడానికి మంచి అవకాశం వుందన్నారు. చిరంజీవి కాంగ్రెస్ నుండి పోటీ చేస్తానంటే షర్మిలతో తాను మాట్లాడతా... తిరుపతి నుండి గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకుంటానని చింతా మోహన్ వెల్లడించారు. 

click me!