
సరిగ్గా నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ ముందు టిడిపి సమీకరణల్లో గందరగోళం మొదలైంది. మరో ఆరు రోజుల్లో పోలింగ్ ఉందనగా స్వయంగా చంద్రబాబునాయుడే ఈ గందరగోళానికి తెరలేపటం విచిత్రంగా ఉంది. గంగుల సోదరుల్లో ఒకరైన గంగుల ప్రతాపరెడ్డి బుధవారం రాత్రి చంద్రబాబును కలిసిన దగ్గర నుండి నంద్యాల టిడిపిలో గందరగోళం మొదలైంది. ఎంఎల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన సోదరుడు ప్రతాపరెడ్డి కూడా గతంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలిసారు. అయితే, పార్టీలో మాత్రం చేరలేదు.
తాజాగా చంద్రబాబు-ప్రతాపరెడ్డి భేటీ జరిగింది. అయితే, గంగుల ప్రతాపరెడ్డి టిడిపిలో చేరిపోయారని, వైసీపీకి షాక్ అంటూ ఒక వర్గం మీడియా బుధవారం రాత్రి నుండి ఒకటే ఊదరగొట్టేసింది. సరే, కాసేపటికే ప్రచారంలో నిజం లేదని తెలిసి మౌనం వహించాయనుకోండి అది వేరే సంగతి. వారి భేటీలో ఏం జరిగిందో బయటకు వెల్లడికాకపోయినా ఇప్పటికీ ప్రతాప రెడ్డి అయితే టిడిపిలో చేరలేదన్నది వాస్తవం.
ఈ సంగతి ఇలా వుంటే, గంగుల-చంద్రబాబు భేటీ నంద్యాలలోని టిడిపి వర్గాల్లో పెద్ద షాక్ కు గురిచేసాయనే చెప్పాలి. ఎందుకంటే, ఆళ్ళగడ్డ, నంద్యాలలో గంగుల కుటుంబంతో దశాబ్దాల వైరం ఉంది భూమా, ఎస్పీవై కుటుంబాలకు. వీరితో పాటు ఏవి సుబ్బారెడ్డి, ఎన్ఎండి ఫరూక్ కూడా గంగుల చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఎప్పుడైతే వీరిద్దరి భేటీ జరిగిందని తెలియగానే వెంటనే పై వర్గాలన్నీ తమ మద్దతుదారులతో వెంటనే సమావేశమై పరిస్ధితిని సమీక్షించుకున్నాయ్.
బాలకృష్ణ రోడ్డుషోలో పాల్గొంటున్న భూమా అఖిలప్రియకు వీరి భేటీ విషయం తెలియగానే పెద్ద షాక్ కొట్టినట్లు ఫీల్ అయ్యారట. వెంటనే రోడ్డుషో లో నుండి దిగిపోయి మద్దతుదారులతో సమావేశమయ్యారు. విచిత్తరమేమిటంటే, ప్రతాపరెడ్డి, చంద్రబాబులు భేటీ అయ్యేవరకు కూడా నంద్యాల, ఆళ్ళగడ్డలోని టిడిపి నేతలవరికీ కనీసం సమాచారం కూడా తెలీకుండా జాగ్రత్తపడ్డారు. దాంతో అందరూ చంద్రబాబు మీద మండిపడుతున్నారు.
గంగుల కుంటుబాన్ని టిడిపిలోకి రాకుండా అడ్డుకోవటమే వీరందరి లక్ష్యం. ఒకవేళ వీళ్ళందరినీ కాదని గంగులను చంద్రబాబు పార్టీలో చేర్చుకుంటే పరిస్ధితి ఏమిటో, ఏం చేయాలో ఎవరికీ అర్ధం కావటం లేదు. మరి, వర్గ రాజకీయాల గురించి తెలిసి కూడ ఇటువంటి సమయంలో చంద్రబాబు ఎందుకు గందరగోళానికి తెరలేపుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.