పవన్‌ కల్యాణ్‌పై పోటీకి సిద్ధం..జగన్ ఆదేశిస్తే చాలు : కమెడియన్ అలీ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jan 17, 2023, 02:28 PM ISTUpdated : Jan 17, 2023, 02:39 PM IST
పవన్‌ కల్యాణ్‌పై పోటీకి సిద్ధం..జగన్ ఆదేశిస్తే చాలు : కమెడియన్ అలీ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

సినీ నటుడు , ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీ చేయడానికి తాను సిద్ధమని ఆయన ప్రకటించారు.

సినీ నటుడు , ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీ చేయడానికి తాను సిద్ధమని ఆయన ప్రకటించారు.  సీఎం ఆదేశిస్తే ఎవరిపైనైనా పోటీ చేస్తానని అలీ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారో ప్రజలకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. విమర్శలు ప్రతి విమర్శలు చేయటం సాధారణమని.. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని అలీ అన్నారు. చిత్తూరు జిల్లా నగరి పర్యటనలో భాగంగా మంగళవారం అలీ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా... నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అలీ.... రాజకీయాలకు కూడా అప్పుడప్పుడూ కాస్త దగ్గరగానే ఉంటూ వస్తున్నారు. 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా వైసీపీలో చేరి అందరినీ ఆశ్చర్య పరిచారు . అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నా సీట్ల సర్దుబాటులో అది కుదరలేదు. దీంతో వైసీపీ తరఫున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అలీ చేత ప్రచారం చేయించింది వైసీపీ. దీంతో పార్టీ అధికారంలోకి వస్తే అలీకి మంచి పదవి ఖాయం అంటూ ప్రచారం జరిగింది కూడా. కానీ, అది జరగలేదు. దాంతో అలీ చాలా డిజప్పాయింట్ గా ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారే అవకాసం ఉందని వార్తలు వచ్చాయి. అలీ గతంలో తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టీవ్‌గా ఉండేవారు. కానీ ఇప్పుడు మళ్లీ అటు సొంతగూట్లోకి వెళ్లే ఉద్దేశ్యం లేదట. పవన్ కళ్యాణ్‌తో ఆయనకు ఉన్న స్నేహం కారణంగా జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. 

Also REad: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కమెడియన్ అలీ.. ఉత్తర్వులు జారీ

ఇదిలా ఉంటే వైసీపీలో అలీ చేరిన తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే సినిమా ఇండస్ట్రీ కాస్త దూరం పెట్టిందని కూడా ప్రచారం జరుగుతోంది. టీడీపీలో వున్నంత వరకూ సినిమా అవకాశాలు పుష్కలంగా ఉన్న అలీకి ఇప్పుడు పూర్తిగా అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం వైసీపీలో చేరడమే అంటున్నారు అలీ సన్నిహితులు. అయితే కొత్త నీరు ఇండస్ట్రీకి రావటం, కొత్త కమిడియన్స్ పరిశ్రమలో పరిచయం కావటం, పాత డైరక్టర్స్ తగ్గటం కారణం అని సినీ వర్గాలు అంటున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  ఆయనకు ఇంతవరకు ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ ఎలాంటి పదవీ రాలేదు. అటు సినిమాలు లేక.. ఇటు పదవీ రాక తనలో తానే ఆందోళన చెందుతున్న సమయంలో అలీకి జగన్ గుడ్‌న్యూస్ చెప్పారనే అనుకోవాలి.

మరోవైపు.. ఇటీవల తాను వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు అలీ. కొందరు తనపై కావాలనే కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీని వీడే ప్రసక్తే లేదని అలీ స్పష్టం చేశారు. పదవులు, ప్రయారిటీల కోసం తాను వైపీపీలో చేరలేదని అలీ పేర్కొన్నారు. వైఎస్ జగన్‌ని ముఖ్యమంత్రిని చెయ్యాలనే లక్ష్యంతోనే వైసీపీలో పనిచేశానని ఆయన తెలిపారు. తనకు పదవులు ముఖ్యం కాదని, జగన్ మనసులో స్థానమే ముఖ్యమని అలీ వెల్లడించారు. మరోసారి జగన్ సీఎం అయ్యేందుకు పార్టీకి అంకిత భావంతో పనిచేస్తానని.. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మైనార్టీలకు జగన్ చేశారని అలీ ప్రశంసించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీని నియమిస్తూ గతేడాది అక్టోబర్ 27న సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!