నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అలీ.. రాజకీయాలకు కూడా అప్పుడప్పుడూ కాస్త దగ్గరగానే ఉంటూ వస్తున్నారు. ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఎక్కువగా వుండే నంద్యాల లేదా గుంటూరు లోక్‌సభ నుంచి ఆయనను బరిలో దించాలని జగన్ కూడా భావిస్తున్నారట.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దానితో పాటే సార్వత్రిక ఎన్నికలు కూడా ఒకే సమయంలో జరుగుతాయి. ఈ నేపథ్యంలో టికెట్ కోసం ఆశావహులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. సామాజిక సమీకరణలు, ఆర్ధిక, అంగ బలాలను లెక్కలోకి తీసుకుని టికెట్లు కేటాయించాల్సిందిగా నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. ఇక సినిమాలకు, రాజకీయాలకు మనదేశంలో విడదీయలేని అనుబంధం వుంది. దశాబ్ధాలుగా సినీతారలు పలు పార్టీల్లో చేరి చట్టసభల్లో అడుగుపెట్టగా.. తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లలో వారే పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు కాగలిగారు.
సినీ గ్లామర్ పరంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం , జనసేనలు ముందున్నాయి. టీడీపీకి నందమూరి కుటుంబంతో పాటు టాలీవుడ్‌లోని నిర్మాతలు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు తొలి నుంచి అండగా వుంటూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనకు పరోక్షంగా మెగా ఫ్యామిలీ అండదండలు వున్నాయన్నది బహిరంగ రహస్యం. వీరితో పాటు కొందరు సినీ ప్రముఖులు జనసేన వెంట వున్నారు. వైసీపీ మాత్రం ఈ విషయంలో వెనుకబడే వుంది. కమెడియన్ అలీ, దర్శకుడు పోసాని కృష్ణమురళీ సహా ఒకరిద్దరు మాత్రమే వైసీపీకి జై కొడుతున్నారు.
ఇదిలావుండగా.. నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అలీ.. రాజకీయాలకు కూడా అప్పుడప్పుడూ కాస్త దగ్గరగానే ఉంటూ వస్తున్నారు. 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా వైసీపీలో చేరి అందరినీ ఆశ్చర్య పరిచారు . అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నా సీట్ల సర్దుబాటులో అది కుదరలేదు. దీంతో వైసీపీ తరఫున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అలీ చేత ప్రచారం చేయించింది వైసీపీ. ఆయన కూడా తనకు ఎలాంటి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వనప్పటికీ పార్టీని అంటిపెట్టుకునే వున్నారు .
ఈ నేపథ్యంలోనే ఆయనను ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్‌గా నియమించారు జగన్. అయితే ఈసారి మాత్రం తాను ఎన్నికల బరిలో నిలవాలని అలీ గట్టి పట్టుదలతో వున్నారు. ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఎక్కువగా వుండే నంద్యాల లేదా గుంటూరు లోక్‌సభ నుంచి ఆయనను బరిలో దించాలని జగన్ కూడా భావిస్తున్నారట. ప్రస్తుతం వైసీపీ తరపున సామాజిక సాధికార బస్సు యాత్రలో అలీ ముమ్మరంగా పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించనప్పటికీ, వైసీపీ పట్ల అలీ విధేయతతోనే వున్నారు. ఇది ఆయనకు ప్లస్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ కూడా అలీకి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.