దేవినేని ఉమాకు , కృష్ణప్రసాద్‌కు వైరం ఎందుకొచ్చింది .. టీడీపీలో ‘‘ వసంత ’’ చేరితే బాబు వ్యూహమేంటీ..?

By Siva Kodati  |  First Published Jan 31, 2024, 4:05 PM IST

మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వసంత కుటుంబానికి ప్రత్యర్ధిగా వున్న దేవినేని ఉమా.. కృష్ణప్రసాద్‌ను సైకిల్ ఎక్కనిస్తారా అన్న టాక్ వినిపిస్తోంది. 


మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీలో చేరితే మైలవరం లేదా పెనమలూరులలో ఆయనను బరిలో దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వసంత కుటుంబానికి ప్రత్యర్ధిగా వున్న దేవినేని ఉమా.. కృష్ణప్రసాద్‌ను సైకిల్ ఎక్కనిస్తారా అన్న టాక్ వినిపిస్తోంది. దశాబ్ధాలుగా మైలవరం, నందిగామ ప్రాంతాల్లో ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తొలుత టీడీపీలోనే వున్న ఈ రెండు ఫ్యామిలీల మధ్య వైరం ఎందుకొచ్చింది...ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ తిరిగి సొంతగూటికి ఎందుకు రావాలనుకుంటున్నారు..? వీరి మధ్య చంద్రబాబు ఎలాంటి రాజీ ఫార్ములాను అనుసరించనున్నారో చూస్తే :

కృష్ణా జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో ‘‘వసంత’’ ఫ్యామిలీ ఒకటి. రాజకీయాల్లో తలపండిన సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు దశాబ్ధాల పాటు రాజకీయాలు చేశారు. తెలుగుదేశం పార్టీలో, ప్రభుత్వంలో కీలక నేతగా వున్న ఆయన ఎన్టీఆర్ హయాంలో హోంమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్, టీడీపీలలో క్రియాశీలకంగా వుండటంతో పాటు కృష్ణా జిల్లాను ఒకప్పుడు శాసించిన నేత. తన వారసుడిగా వసంత కృష్ణప్రసాద్‌ను ప్రకటించి .. ఆయన తెరవెనుక రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో మంచి పట్టున్న వసంత కుటుంబానికి తొలి నుంచి దేవినేని ఫ్యామిలీ సవాల్ విసురుతూ వచ్చింది. మాజీ మంత్రి దివంగత దేవినేని వెంకట రమణ.. ఆయన సోదరుడు దేవినేని ఉమాలను వసంత కుటుంబం ఢీకొడుతూ వచ్చింది. 

Latest Videos

టీడీపీ ఆవిర్భావం తర్బాత వచ్చిన 1983, 1984 ఎన్నికల్లో వసంత నాగేశ్వరరావు నందిగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్ కేబినెట్‌లో హోంమంత్రిగా పనిచేశారు . ఆ తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి దేవినేని వెంకట రమణ ఆయనకు ప్రత్యర్ధిగా మారారు. 1994 ఎన్నికల్లో రమణ టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వసంత కుటుంబం కాంగ్రెస్‌లో చేరింది. 1999లో జరిగిన ఎన్నికల్లో దేవినేని ఉమా టీడీపీ నుంచి కృష్ణప్రసాద్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా ఉమ విజయం సాధించారు. 2004లో ఉమా టీడీపీ నుంచి పోటీచేయగా.. ఈసారి వసంత నాగేశ్వరరావు కొడుకుకు బదులుగా తను బరిలో దిగారు. అయినప్పటికీ ఉమానే విజయం వరించింది. 

తదనంతర కాలంలో నందిగామ ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో దేవినేని, వసంత కుటుంబాలు మైలవరానికి షిప్ట్ అయ్యాయి. 2009లో దేవినేని ఉమా టీడీపీ నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. నియోజకవర్గం మారినా ఆయనే గెలుపొందడం విశేషం. కమ్మ సామాజిక వర్గానికి మైలవరం పెట్టని కోట కావడంతో ఇరు కుటుంబాలు ఈ సెగ్మెంట్‌నే తమ రాజకీయానికి వేదికగా మార్చుకున్నాయి. కానీ టీడీపీలో ఉమా వున్నంత వరకు వసంత గెలుపొందడం కష్టమని తేలిపోయింది. దీంతో 2019 ఎన్నికలకు ముందు వసంత కుటుంబం జగన్ సమక్షంలో వైసీపీలో చేరింది. ఆ ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్.. తన చిరకాల ప్రత్యర్ధి ఉమాను ఓడించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతి నుంచి ఉమాను కార్నర్ చేసేలా వసంత వ్యవహరించారన్న వాదనలు వున్నాయి. అసలు ఉమా కారణంగానే తమ లాంటి నేతలు టీడీపీని వీడుతున్నారంటూ కృష్ణ ప్రసాద్ ఓ సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి వెళ్తున్నానంటూ ఉమా తనపై నియోజకవర్గంలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను చేస్తున్న అభివృద్ధి చూడలేకే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని వసంత ఆరోపించారు. ఈ విమర్శల సంగతి పక్కనబెడితే.. అప్పటి వరకు జగన్‌పై వసంత కుటుంబానికి సాఫ్ట్ కార్నర్ వుండేది. ముఖ్యంగా తన కొడుకును ఎమ్మెల్యేను చేసింది వైసీపీయేనంటూ సన్నిహితుల వద్ద జగన్‌పై వసంత నాగేశ్వరరావు ప్రశంసలు కురిపించేవారు. 

అలాంటిది రెండేళ్ల క్రితం జరిగిన కమ్మ వారి వన సమారాధనలో జగన్‌, వైసీపీలపై వసంత నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. దీనికి కారణం మంత్రి జోగి రమేష్. జగన్ రెండో విడత మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కొడాలి నానిని తప్పించడంతో ఆయన స్థానంలో.. కమ్మ కోటాలో తన కుమారుడికి మంత్రి పదవి వస్తుందని పెద్దాయన భావించారు. కానీ దానికి భిన్నంగా జోగి రమేష్‌ను పదవి వరించడాన్ని నాగేశ్వరరావు జీర్ణించుకోలేకపోయారు. తన కొడుకుకు మైలవరంలో పక్కలో బల్లెంలా మారిన జోగిని కంట్రోల్ చేయాల్సిందిపోయి.. అతనికి జగన్ మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమే అయ్యారు. దీనికి పర్యవసానంగానే జగన్, వైసీపీలపై వసంత నాగేశ్వరరావు ఘాటు విమర్శలు చేయడం. 

ఈ పంచాయతీ ఇలా కొనసాగుతూ వుండగానే జగన్ .. నియోజకవర్గాల సమన్వయకర్తలను ఎంపిక చేసే పని మొదలుపెట్టారు. ఈ సమయంలోనే వసంత పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. వైసీపీలో తనకు ప్రాధాన్యత లేకపోవడంతోనే కృష్ణప్రసాద్ పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తమపైనా, తమ పార్టీ నేతలపైనా నిత్యం నోరుపారేసుకునే జోగి రమేష్‌‌ను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని తెలుగుదేశం పార్టీ కృతనిశ్చయంతో వుంది.

ఇప్పటికే పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జోగి రమేష్‌ను అభ్యర్ధికి దించారు జగన్. పార్థసారథి టీడీపీలో చేరినా.. ఆయనను నూజివీడుకు షిప్ట్ చేసేలా మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు చంద్రబాబు. జోగి రమేష్‌పై పీకలదాకా వున్న వసంత కృష్ణ ప్రసాద్ రేపు టీడీపీలో చేరి పెనమలూరు నుంచి పోటీ చేసేలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లుగా టాక్. 

లేదు .. జోగి రమేష్‌ను మైలవరానికి పంపినా, అక్కడా ఆయనకు ప్రత్యర్ధిగా వసంత కృష్ణ ప్రసాద్‌నే ఖరారు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే రెండు నియోజకవర్గాల్లో వసంత, దేవినేని ఉమాల పేర్లతో సర్వే చేయిస్తున్నారట. రెండింట్లో ఒకదానిని వసంతకు కేటాయించి, మరో దానిని ఉమాకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. తన సీటుకు ఎసరు వస్తుందనే భావనతోనే వసంత కుటుంబంతో దేవినేని ఢీకొట్టారనే వాదన లేకపోలేదు. అలాంటి పరిస్థితి లేకపోతే.. తనకు అభ్యంతరం ఏముంటుందని ఉమా అభిప్రాయం. అందుకే పెనమలూరు, మైలవరం నియోజకవర్గాలను ఈ రెండు కుటుంబాలకు సర్దుబాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. 

click me!