ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జోరుగా కోడి పందాలు..చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు

By Sumanth KanukulaFirst Published Jan 14, 2022, 4:55 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లాల్లో కోడి పందాల సందడి కొనసాగుతుంది. ఇందుకోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కోడి పందాల శిబిరాల వద్ద కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లాల్లో కోడి పందాల సందడి కొనసాగుతుంది. ఇందుకోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు కోడి పందాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఆంక్షలున్నా సరే తగ్గేదేలే అంటూ పందెం రాయుళ్లు కోళ్లను బరుల్లోకి దింపుతున్నారు. అయితే బైండోవర్ కేసులు, శిబిరాలు తొలగింపు పేరుతో నిన్న సాయంత్రం వరకు హడావుడి చేసిన పోలీసులు, అధికారులు.. పోటీలు ప్రారంభమయ్యాక చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. 

తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి మండలం దుప్పలపూడిలో కోడి పందాలను ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి స్వయంగా ప్రారంభించడం గమనార్హం. ఉభయ గోదావరి జిల్లాల్లోని భీమవరం, ఉంది, వెంప, దెందులూరు, తణుకు, అమలాపురం, రావులపాలెం, ముమ్మిడివరం, రామచంద్రాపురం, కాకినాడ, రాజానగరం, ఐ.పోలవరం, రాజోలులో పెద్ద ఎత్తున కోడి పందాలను నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లాలో నందిగామ, కంచికచర్ల, నూజివీడు, ముసునూరు, అగిరిపల్లి, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి, జగ్గయ్యపేట మండలాల్లో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. చాలా చోట్ల ప్రజాప్రతినిధులు సమక్షంలోనే కోడిపందాల నిర్వాహణ జరుగుతుంది. కోడి పందాల శిబిరాల వద్ద కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. 

ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు.. 
కొన్ని చోట్ల కోడి పందాలను వీడియో తీసి.. ఆన్‌లైన్ లైవ్‌ టెలికాస్ట్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాలు, విదేశాల్లో ఉన్నవారు కోడి పందాలు చూసేందుకు వీలు కలుగుతుంది. అలా కోడి పందాలను వీక్షిస్తున్న కొందరు వారు ఉన్న చోటు నుంచే బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్టుగా సమాచారం. మరోవైపు పందెం కోళ్లను పెంచుతున్న కొందరు.. వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటుచేసి ఖరీదైన కోళ్ల జాతులు, వాటి వివరాలతో పెద్దఎత్తున వ్యాపారాలు చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారానే విక్రయాలు కొనసాగిస్తున్నారు. కోడి రంగు, రకాన్ని బట్టి రూ.50 వేల నుంచి లక్ష వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. 

మరోవైపు కోడి పందాలతో పాటుగా పేకాట పోటీలు, గుండాట పలుచోట్ల సాగుతుంది. కొన్నిచోట్ల రాత్రికి రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసేందకు కూడా కొందరు సిద్దమయ్యారు. తోటల్లో పరిమిత సంఖ్యలో వీటిని నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.  

click me!